MLA Anil Kumar : అయ్యప్ప దీక్షలో ఉంటూ ముస్లిం టోపీ పెట్టుకోవడంపై వివాదం.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఎదురుదాడి

అన్ని మతాలను తాను సమానంగా గౌరవిస్తానని అన్నారు. శబరిమల వెళ్లే భక్తులంతా ముందుగా వావర్ స్వామిని దర్శించుకుంటారని, ఆయన ముస్లింలకు ఆరాధ్య దైవం అని చెప్పారు.

MLA Anil Kumar : అయ్యప్ప దీక్షలో ఉంటూ ముస్లిం టోపీ పెట్టుకోవడంపై వివాదం.. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఎదురుదాడి

MLA Anil Kumar : అయ్యప్ప మాలలో ఉండి ముస్లింల సంప్రదాయ టోపీ ధరించడంపై చెలరేగిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. హిందువుల మనోభావాలను కించపరిచారంటూ నిన్న అనిల్ కుమార్ ఇంటిని బీజేపీ, బీజేవైఎం నేతలను ముట్టడించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు అనిల్. అన్ని మతాలను తాను సమానంగా గౌరవిస్తానని అన్నారు. శబరిమల వెళ్లే భక్తులంతా ముందుగా వావర్ స్వామిని దర్శించుకుంటారని, ఆయన ముస్లింలకు ఆరాధ్య దైవం అన్నారు మంత్రి అనిల్.

”నేను ఏదో పెద్ద అపచారం చేసేశానని, హిందూ ధర్మాన్ని కించపరిచానని, ముస్లింల టోపీ పెట్టుకుని అపచారం చేశానని రాద్దాంతం చేశారు. నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లలకు ధర్మం గురించి తెలియదు. ఏదో వచ్చారు. ధర్నా చేశారు వెళ్లిపోయారు. కనీసం సోమువీర్రాజు లాంటి పెద్దలు.. కనీసం చేయాల్సిన ఆలోచన ఏంటంటే.. ఎవరి ధర్మాన్ని వారి గౌరవించుకోవాలి. అసలు అయ్యప్ప మాల ధరించడానికి ముందు, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లే ముందు.. ముస్లిం అయిన వావర్ స్వామిని ఆయన మసీదుకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాతే శబరిమలకు వెళ్తారని కనీసం తెలియదా? ఓట్ల కోసం, రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు రాజకీయం చేయడం దారుణం” అని అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు.

నెల్లూరు రొట్టెల పండగకు ఎంతమంది హిందువులు రావడం లేదు. అజ్మీర్ దర్గాకు ఎంతమంది హిందువులు వెళ్లడం లేదు అని బీజేపీ నేతలను నిలదీశారు అనిల్ కుమార్. నేను మతంతో రాజకీయం చేయను అని ఆయన అన్నారు. అయ్యప్ప మాలలో ఉండి.. నమాజ్ టోపి పెట్టుకోకూడదని శాస్త్రం ఉంటే తెలపాలని బీజేపీ నాయకులకు ఛాలెంజ్ చేశారు అనిల్. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్షలోనే ఉందన్నారు. నేను చేసింది తప్పు కాదని సమాజానికి తెలుసన్నారు అనిల్ కుమార్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అయ్యప్ప మాల దీక్షలో ఉండి.. అనిల్ కుమార్.. మసీదుకి వెళ్లడం, ముస్లిం టోపీ, కండువా ధరించడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ ఇంటింటికీ తిరిగారు. ఆ సమయంలో ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనిపై బీజేవైఎం కార్యకర్తలు నిరనస తెలిపారు. అనిల్ ఇంటి ముందు ధర్నా చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.

హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్పమాల దీక్షను అవమానపరిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీక్షాపరులకు ఎమ్మెల్యే అనిల్ క్షమాపణ చెప్పాలన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసీపీ నేత బరితెగించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని హెచ్చరించారు.