Weather Forecast : శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో పెరగనున్న చలిపులి- ఏపీలో పొడి వాతావరణం

ఈ వీకెండ్ లో హైదరాబాదీలకు సిమ్లా,ఊటి,కాశ్మీర్ లలో వుండే వాతావరణం కనిపించే అవకాశం వుంది. నగరంలో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతారణ శాఖ న

Weather Forecast : శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో పెరగనున్న చలిపులి- ఏపీలో పొడి వాతావరణం

Weather Forecast

Weather Forecast :  ఈ వీకెండ్ లో హైదరాబాదీలకు సిమ్లా,ఊటి,కాశ్మీర్ లలో వుండే వాతావరణం కనిపించే అవకాశం వుంది. నగరంలో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతారణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ఉదయం వేళలో పొగమంచు ఏర్పడుతుందని తెలిపింది.

నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో ఈనెల 20 వతేదీ వరకు రాత్రి ఉష్ణోగ్రతలు మార్పు ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ సంచాలకులు నాగరత్న చెప్పారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని…మార్చి మొదటి వారం నుంచి ఎండ తీవ్రత ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంటుందని ఆమె వివరించారు.

ఫిబ్రవరి 4 శుక్రవారం తెల్లవారుజామున నగరంలో సగటు రాత్రి ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కుత్బుల్లాపూర్ మరియు దాని పొరుగు ప్రాంతాలలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత పటాన్‌చెరులో రాత్రి ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా ప్రకారం గాజులరామారం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, చార్మినార్ సహా పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గే అవకాశం ఉంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వారాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాలు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.సో.. హైదరాబాద్ నగరవాసులు శని, ఆదివారాల్లో చలిని తట్టుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read :Vasantha panchami 2022 : వసంత పంచమి సందర్భంగా బాసరకు పోటెత్తిన భక్తులు

అటు ఏపీలో కూడా మరో రెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయన్నారు. దీంతో మూడు రోజుల వరకూ వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దట్టమైన పొగ మంచు ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా విశాఖ మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తుందని.. ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.