వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.. ఇచ్చిన మాట నెరవేరస్తున్న సీఎం జగన్

  • Published By: sreehari ,Published On : April 24, 2020 / 03:46 AM IST
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.. ఇచ్చిన మాట నెరవేరస్తున్న సీఎం జగన్

పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది.. కేంద్రం నుంచి వచ్చే నిధులూ కూడా తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇచ్చిన మాటకోసం పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులను అందిస్తున్నారు సీఎం జగన్. అంతేకాదు.. పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. 

పేద కుటుంబాలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం (ఏప్రిల్ 24) వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. క్యాంపు కార్యాలయంలో పొదుపు సంఘాల మహిళల అకౌంట్లలోకి సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కుతారు. ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల అకౌంట్లలోకి CFMS ద్వారా ఒకే విడతగా డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.

90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల అకౌంట్లలో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి లేఖ రాశారు. చెప్పినట్టుగా ఇచ్చిన మాట కోసం సీఎం జగన్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం నగదును జమ చేస్తున్నారు.