బాలరాజుకు వైసీపీ పెద్దల ఝలక్‌!

  • Published By: sreehari ,Published On : March 16, 2020 / 03:56 PM IST
బాలరాజుకు వైసీపీ పెద్దల ఝలక్‌!

విశాఖ జిల్లాలో ఆయనకు ఎదురులేదు. 11 మండలాల పరిధిలోని గిరిజన ప్రాంతానికి ఎన్నోఏళ్ల నుంచి కాంగ్రెస్ నుంచి అధినాయకత్వం వహించారు.. అత్యంత సీనియర్ రాజకీయ నేత కూడా ఆయన ఎవరో కాదు.. పసుపులేటి బాలరాజు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత వివిధ పార్టీలకు నేతలు క్యూ కట్టినా సరే బాలరాజు మాత్రం కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫునే బరిలోకి దిగిన ఆయన.. ఆ తర్వాత రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో బాలరాజు ఆ పార్టీలో చేరారు. రెండు నెలల కిందట జనసేన పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇటీవల  రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటుగా కుమార్తె దర్శినిను కూడా వైసీపీలో చేర్చారు.  

జడ్పీ చైర్ పర్సన్ చేయాలని :
విశాఖ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వు కావడంతో తన కుమార్తె డాక్టర్‌ దర్శినిని  జడ్పీ చైర్‌పర్సన్ చేయాలన్న ఉద్దేశంతో బాలరాజు వ్యూహాత్మకంగా ఈ అడుగు వేశారనే చర్చ మొదలైంది. ఇందుకు గూడెంకొత్తవీధి జడ్‌పీటీసీ నుంచి వైసీసీ తరఫున బరిలో దింపాలన్న ఉద్దేశంతో వైసీపీలో చేరారని చెబుతున్నారు. బాలరాజు కుమార్తె గూడెం కొత్తవీధి నుంచి బరిలోకి దిగి, జడ్పీ చైర్‌పర్సన్ పీఠంపై కూర్చోవాలని భావించారట. ఇది తెలుసుకున్న వైసీపీ నాయకులు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వర్గీయులు భగ్గుమన్నారు. పార్టీలో చేరిన వెంటనే జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు చేయడం ఏమిటంటూ రగడకు దిగారు. 

విజయసాయిరెడ్డి వద్ద పంచాయతీ :
కార్యకర్తలు భారీగా చేరుకుని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేడర్‌లో తలెత్తిన ఆగ్రహాన్ని గమనించిన ఆమె హుటాహుటిన విశాఖకు వచ్చి, బాలరాజు చేరికను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి వద్ద పంచాయితీ పెట్టారట. జీకేవీధి జడ్‌పీటీసీ టికెట్‌ను బాలరాజు కుమార్తెకు కేటాయించవద్దని విన్నవించుకున్నారు. దీనివల్ల పార్టీలో తలెత్తే భవిష్యత్తు పరిణామాలను వివరించారట.

అంతే విజయసాయి రెడ్డితో సహా అధినాయకత్వం ప్రత్యామ్నయ ఆలోచనలో పడిందట. ఈ సంక్షోభానికి మధ్యేమార్గంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేసిందట. ఇటు బాలరాజు కుమార్తె దర్శినికి కాకుండా, అటు  ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సిఫారసు చేసిన అభ్యర్థికి కాకుండా గతంలో పాడేరు సమన్వయకర్తగా పనిచేసి, ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు అవకాశం కల్పించాలని వైసీపీ నాయకత్వం భావించిందని అంటున్నారు. 

బాలరాజు వర్గీయులకు ఆశాభంగం:
జడ్పీ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో విశ్వేశ్వరరాజు భార్య శివరత్నానికి జడ్‌పీటీసీ టిక్కెట్టు కేటాయించారు. ఈ పరిణామంతో బాలరాజు వర్గీయులకు ఆశాభంగం కాకతప్పలేదు. ఎన్నో ఆశలతో పార్టీలో చేరితే అందినట్లే అంది జడ్పీ పీఠం చేజారిపోవడంతో  బాలరాజు అలిగారట. పార్టీ అవిర్భావ దినోత్సవానికి సైతం డుమ్మా కొట్టారు. ఇటీవల పార్టీలో చేరిన వారంతా వచ్చినా బాలరాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

ఆయన లోలోన మధన పడినా బయటకు మాత్రం గంభీరంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారట. పదవుల కోసం వైసీపీలో చేరలేదని, పార్టీ విధానాలు, జగన్‌ పరిపాలన నచ్చి చేరామంటూ తన మద్దతుదారులను సముదాయించే పనిలో బిజీబిజీగా ఉన్నారని చెబుతున్నారు.