Ugadi Festival : చైత్రమాసం – ఉగాది పండుగ విశిష్టత

Ugadi Festival : చైత్రమాసం – ఉగాది పండుగ విశిష్టత

Ugadi Festival Importance

Ugadi Festival Importance :  ఉగాది తెలుగువారి పండుగ.. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.

ఉగస్య ఆది అనేదే ఉగాది. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం… చైత్రమాసం అనగానే మనకి ఈనెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్ర శుధ్ద పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రులు జరుపుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్న రోజు కాబట్టి దీనికి చైత్రము అనే పేరు వచ్చిందని కూడా చెపుతారు.

సూర్యుడు కూడా మొదటి రాశియైన మేష రాశిలో సంచరిస్తున్నాడు. చైత్ర మాసంలో జరుపుకునే వసంత నవరాత్రులకు రామాయణానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు, వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.

ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఆసంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ద పాడ్యమితో మొదలవుతుంది.

“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు.

కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం.

తెలుగు వారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లు వాకిళ్లు శుభ్రపరుచుకుని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ఆరంభిస్తారు. ఉగాది పచ్చడి తీపి, చేదుల కలయిక. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం.

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్ధానం ఇచ్చారు. ఉగాది పచ్చడిలో ‘వేపపువ్వు’ వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రదాయినిగా చెబుతుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడిలో వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు తో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం.

ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకం చదువుకోవాలని పెద్దలు చెబుతారు.
శతాయు వజ్రదేహాయ
సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ
నింబకం దళబక్షణం

గత 2 ఏళ్ళుగా గడిచిన వికారినామ సంవత్సరము(2019), పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి(అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోనికి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైనది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం? ప్లవ అంటే, దాటించునది అని అర్థం. “దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం…….” దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగు లోకి నడిపిస్తుందని అర్థం.

వికారి, శార్వరి తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి గదా. మరి ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచనయేగదా. ప్లవ నామ సంవత్సరం ముగియగానే “శుభకృత్”, ఆ తరువాతది ” శోభకృత్” సంవత్సరములు. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడనూ మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. అభయాన్ని ప్రసాదిస్తాయి.

అందుకే, ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఆంధ్ర,తెలంగాణ కర్ణాటకల్లో ఉగాదిగా పిలుచుకునే ఈపండుగను మహారాష్ట్రలో గుడిపాడ్వా అనే పేరుతో పిలుస్తారు. సిక్కులువైశాఖీ గానూ, బెంగాలీలు పోయ్లా బైశాఖ్ గాను ఉగాదిని జరుపుకుంటారు. ఈ ప్లవనామ సంవత్సర ఉగాది సర్వమానవాళికి, సకల జీవులకు సుఖశాంతులను, ఆనందోత్సాహాలను ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం.

ఈ సంవత్సరం అనగా 2021లో ప్లవ నామ సంవత్సర ఉగాదిగా ఏప్రిల్ నెల 13వ తారీఖున జరుపుకోబడుతుంది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణాన్ని చేస్తారు.