ఉగాది పండగ విశిష్టత ఏంటో తెలుసా? ఈ ప్రాధాన్యం మరే పండుగకూ ఉండదు..

Ugadi 2024: జరగబోయే మంచి, చెడుల గురించి తెలుసుకోవడం, చెడు జరుగుతుందనుకుంటే జాగ్రత్త పడడం పంచాంగ శ్రవణం ముఖ్య ఉద్దేశం.

ఉగాది పండగ విశిష్టత ఏంటో తెలుసా? ఈ ప్రాధాన్యం మరే పండుగకూ ఉండదు..

Ugadi 2024

తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సర ఉగాది. తొలి పండుగగా భావించి తెలుగువారు ఉగాదిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులు, ప్రత్యేక అలంకరణలు, రకరకాల పిండివంటలతో ఉగాది పండుగ కోలాహలంగా ఉంటుంది.

అన్నింటికీ మించి షడ్రుచుల సమ్మేళనమయిన ఉగాది పచ్చడి మన సంస్కృతీ, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు అద్దం పడుతుంది. ఇక ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం తెలుగు వారి జీవితంలో ఓ భాగం.

ఉగాదిని తొలి పండుగగా పిలుచుకుంటారు తెలుగువారు. ఉగస్య ఆదిని ఉగాదిగా పిలుస్తారు. జన్మ, నక్షత్ర గమనం మొదలు కావడం దీనర్థం. అలాగే యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు పదం ఉగాదిగా భావిస్తారు. హిందువులకు ఏడాదంతా ఏవో ఒక పండుగలు వస్తూనే ఉన్నప్పటికీ… ఉగాదికి ఉండే విశిష్టత, ప్రాధాన్యత మరే పండుగకూ ఉండదు.

చైత్రమాసం మొదటిరోజు
చైత్రమాసం మొదటిరోజును ఉగాదిగా జరుపుకుంటాం. వారం రోజుల ముందు నుంచే ఉగాది కోలాహలం మొదలవుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడాలులేకుండా, ప్రాంతాలకతీతంగా ఉగాది పండుగను తెలుగువారంతా జరుపకుంటారు. దేశవిదేశాల్లో స్థిరపడిన వారు సైతం కొత్త ఏడాదిని షడ్రుచులతో స్వాగతిస్తారు.

పురాణాల ప్రకారం ఉగాదికి ఎంతో విశిష్టత ఉంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజయిన ఉగాది నాడే శ్రీరామచంద్రమూర్తి, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయ్యారని భావిస్తారు. అలాగే బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించింది ఉగాది రోజునే అని నమ్ముతారు.

శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాదే అని భావిస్తారు. ఆ క్రమంలోనే ఉగాది రోజు కొత్త పనులు మొదలు పెట్టడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం వంటివి చేస్తారు. ఏడాదంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు.

పంచాంగ శ్రవణం..
ఉగాది రోజు తెలుగువారు తప్పనిసరిగా చేసే కార్యక్రమం పంచాంగ శ్రవణం. వరాహమిహిరుడు పంచాంగాన్ని ఉగాదిరోజునే ప్రజలందరికీ అంకితం చేశారని భావిస్తారు. అలాగే ఏటా ఒక్కో పేరుతో ఉగాదిని పిలవడంపైనా రకరకాల కారణాలున్నాయి. నారదుడి సంతానం పేర్లే ఉగాది సంవత్సరాలని కొందరు చెబుతారు. దక్షప్రజాపతి కుమార్తెల పేర్ల పైన తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని భావిస్తారు.

వసంతకాలంలో వచ్చే ఈ పండుగకు, ప్రకృతికి అవినాభావసంబంధం ఉంటుంది. ఆకురాలే శిశిరం తర్వాత వచ్చే వసంత రుతువులో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది. చెట్లు చిగురిస్తాయి. సకల చరాచర సృష్టి కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది.

బెల్లం, వేపపువ్వు, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, కారంతో తయారుచేసే ఉగాది పచ్చడి ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారంతో షడ్రుచుల సమ్మేళనంగా ఉండే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ పచ్చడి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్లో ఓ భాగం.

జరగబోయే మంచి, చెడుల గురించి తెలుసుకోవడం, చెడు జరుగుతుందనుకుంటే జాగ్రత్త పడడం పంచాంగ శ్రవణం ముఖ్య ఉద్దేశం. సానుకూల దృక్ఫథంతో ఉండాలని, జాగ్రత్తగా నడుచుకోవాలని, పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు మానసికంగా సంసిద్ధంకావాలని, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడాలని పంచాంగ శ్రవణం సూచిస్తుంది.

40వ వసంతంలోకి తిరుమల అన్నదాన సత్రం.. లక్షలాది మందికి భోజనం పెడుతున్న దీని ప్రత్యేకతలు ఇవే..