IPL 2020: టీ20ల్లో విరాట్ కోహ్లీ కొత్త డిమాండ్.. ధోనీకి సపోర్ట్‌గానేనా?

  • Published By: vamsi ,Published On : October 15, 2020 / 05:03 PM IST
IPL 2020: టీ20ల్లో విరాట్ కోహ్లీ కొత్త డిమాండ్.. ధోనీకి సపోర్ట్‌గానేనా?

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ వైడ్ కాల్ వివాదం తీవ్ర విమర్శలకు కారణం అవుతుంది. ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ ఒక బాల్‌ను వైడ్‌గా ప్ర‌క‌టిద్దామ‌ని చేతులు చాస్తూ ఉండగా.. అది వైడ్ కాదన్నట్లుగా.. ధోనీ కళ్లు పెద్దవి చేయడంతో అంపైర్ తన చేతులు కిందకు దించి వైడ్ ఇవ్వలేదు. ఈ ఘటన కాస్త విమర్శలకు కారణం అవుతుండగా.. ఈ క్రమంలోనే కోహ్లీ చేసిన ఓ డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.



ధోని వల్లే అంపైర్ రీఫెల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని చర్చ జరుగుతుండగా.. భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ.. టీ 20 క్రికెట్‌లో కెప్టెన్లకు మరికొన్ని అదనపు అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టీ-20 క్రికెట్‌లో కెప్టెన్లకు ఆన్-ఫీల్డ్ అంపైర్ల నుంచి వైడ్ బాల్ మరియు నడుము-ఎత్తు నో-బాల్ కాల్‌లను సమీక్షించే అధికారం ఇవ్వాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించారు.



”టీ20క్రికెట్‌లో ఇటువంటి చిన్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయని కోహ్లీ అభిప్రాయపడ్డారు. కెప్టెన్‌గా తప్పు కాల్‌ని సమీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి” అని కోహ్లీ ఒక ఇన్‌స్టాగ్రామ్ చాట్ సెషన్‌లో కేఎల్ రాహుల్‌తో అన్నారు. వేగవంతమైన T20 ఫార్మాట్ మరియు ఐపిఎల్ వంటి ఉన్నత స్థాయి టోర్నమెంట్లలో ఒక్కోసారి చిన్న నిర్ణయం కూడా గేమ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి ఒక నిర్ణయం కచ్చితంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు కోహ్లీ.



ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోనితో జరిగిన వివాదం తరువాత కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేయడంతో ధోనీకి సపోర్ట్‌గా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అయ్యింది.

ఇదిలా ఉంటే పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సరదాగా ట్వీ20ల్లో రూల్స్‌ మార్పుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 100 మీటర్ల దూరానికి పైగా వెళ్లే సిక్స్‌లకు 6 పరుగులు మాత్రమే ఇవ్వకుండా.. అంతకంటే ఎక్కువ పరుగులు ఇవ్వాలని సూచించాడు.



కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2019 ప్రపంచ కప్ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 18 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత కూడా ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో రూల్స్ గురించి ఎమోషనల్ అయ్యాడు. ప్రపంచ కప్‌లో నాకౌట్ దశ ఆకృతిని మార్చాలని కోహ్లీ విలేకరులతో అన్నారు. ఐపీఎల్ మాదిరిగా టేబుల్ టాపర్‌కు రెండు అవకాశాలు రావాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్‌లో ఐపీఎల్‌ వంటి క్వాలిఫైయర్స్‌ జరిగితే కష్టపడ్డవారికి కాస్త బాధ తగ్గుతుందని అన్నాడు.



ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి అందులో ఏడు మ్యాచ్‌లు గెలిచి కూడా ఒక్క మ్యాచ్ కారణంగా బయటకు రావడం కష్టంగా అనిపిస్తుందని నాకౌట్స్‌లో మునుపటి మ్యాచ్‌ల గణాంకాలు పట్టించుకకపోవడం కాస్త ఇబ్బంది పెట్టే విషయం అని కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్ మొత్తం బాగా ఆడినా కూడా కోహ్లీ సేన 45 నిమిషాల పేలవమైన ఆట కారణంగా టోర్నమెంట్ నుండి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.