కరోనా కేసుల్లో చాలావరకూ వైరస్.. లక్షణాలు లేకుండానే వ్యాపిస్తోంది

  • Published By: sreehari ,Published On : November 22, 2020 / 10:14 AM IST
కరోనా కేసుల్లో చాలావరకూ వైరస్.. లక్షణాలు లేకుండానే వ్యాపిస్తోంది

coronavirus cases spread with no symptoms : అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అమెరికా వ్యాప్తంగా కరోనా గతంలో కంటే అత్యధిక స్థాయిలో కేసుల తీవ్రత పెరిగిపోయింది. ఒకరి నుంచి మరొకరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని సీడీసీ కొత్త రిపోర్టులో వెల్లడించింది.



కరోనా బాధితుల్లో చాలామందిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ వారిలో ఇన్ఫెక్షన్ బారినపడుతున్నారు. కరోనా సోకిన బాధితులు తమకు వైరస్ ఉందనే విషయం తెలియకుండానే మరొకరికి అంటిస్తున్నారు.. దాదాపు 50 శాతం కరోనా వ్యాప్తి ఇలానే జరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కరోనా కేసుల్లో చాలావరకు వైరస్ లక్షణాలు లేకుండానే వ్యాపిస్తోందని, ప్రతిఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డీసిజెస్ డైరెక్టర్ ఆంటోనీ ఫౌసీ హెచ్చరిస్తున్నారు. నవంబర్ నెలలో ఎక్కువగా లక్షణ రహిత కరోనా కేసులే ఎక్కువగా నమోదయ్యాయని ఆయన అన్నారు.



ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇండోర్ మీటింగ్స్ సమయంలో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. అందులోనూ చల్లటి వాతావరణంలో అందరూ కలిసి ఒకేచోట డిన్నర్ చేసినా కూడా అసింపోమాటిక్ వైరస్ వ్యాప్తి ప్రధాన కారకంగా మారుతోందన్నారు.



బార్లు సహా ఇతర రద్దీ ప్రదేశాల్లో కూడా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్లుగా మారే ప్రమాదం ఉందంటున్నారు. సీడీసీ రిపోర్టు ప్రకారం.. asymptomatic వ్యాప్తిని నియంత్రించాలంటే ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.



ఇప్పటికే అమెరికా దేశ వ్యాప్తంగా మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి చేసినట్టు ఫౌసి పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి 95శాతం అమెరికన్లు మాస్క్ ధరించడం ప్రారంభించినట్టయితే.. మార్చి నాటికి 1,30వేల మంది ప్రాణాలను కాపాడి ఉండేవారమని ఫౌసీ తెలిపారు. అమెరికాలో శనివారం నాటికి దాదాపు 12 మిలియన్ల మంది కరోనా బారినపడగా.. 2,54,000 మంది మరణించారు.