#UnionBudget2023: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్: నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వృద్ధిరేటును ఏడు శాతంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇది అమృతకాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ అని చెప్పారు.

#UnionBudget2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వృద్ధిరేటును ఏడు శాతంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలో పెట్టుకుని, వారి అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇది అమృతకాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ అని చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోందని ఆమె అన్నారు. తొమ్మిది ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించిందని తెలిపారు. భారత తలసరి ఆదాయం రూ.1.97 లక్షలకు పెరిగిందని చెప్పారు.
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అద్బుత పురోగతి సాధించిందని, దాని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందని చెప్పారు.
కరోనా విజృంభణ సమయంలో ఒక్కరు కూడా ఆకలితో బాధపడకూడదని ఉచితంగా ఆహార ధాన్యాలు అందించే పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. 28 నెలల పాటు 80 కోట్ల మందికి వాటిని అందించామని తెలిపారు. తాము ఇప్పటికే దేశంలో 220 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని అన్నారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం రూ.2.2 లక్షల కోట్లు బదిలీ చేసిందని చెప్పారు. ఏడు ప్రాధాన్య అంశాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని అన్నారు. మొదటి ప్రాధాన్యం సమ్మిళిత వృద్ధి అని చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. 63 వేల వ్యవసాయ పరపతి సంఘాలను డిజిటలైజేషన్ చేస్తామని దీనికి రూ.2 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాలు పండించే రైతులకు మొత్తం కలిపి రూ.20 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు.