GST Collection: నిన్న GDP నుంచి గుడ్ న్యూస్ వచ్చిందో లేదో.. ఈరోజు GST మరో గుడ్ న్యూస్
ఒకరోజు ముందు ప్రభుత్వం అధికారిక జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. NSO విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-34 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

GST Growth: ఆర్థిక రంగంలో ప్రభుత్వం వరుసగా రెండవ రోజు శుభవార్త అందుకుంది. మొదటి త్రైమాసికంలో GDP అద్భుతమైన వృద్ధి రేటు నమోదు చేసుకున్న తర్వాత, GST నుంచి కూడా మరొక గుడ్ న్యూస్ వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టు నెలలో వార్షిక ప్రాతిపదికన GST వసూళ్లలో 11 శాతం పెరుగుదల నమోదైందట. ఇది రూ. 1.59 లక్షల కోట్ల కంటే ఎక్కువని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
ప్రతి నెలా కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి
GST పరంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 అద్భుతంగా గడిచిందనే చెప్పొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ప్రతినెలా జీఎస్టీ వసూళ్లలో వార్షిక పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ 2023లో రూ. 1.87 లక్షల కోట్ల ఆదాయంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. జీఎస్టీ ద్వారా ఇప్పటివరకు ఒక్క నెలలో ప్రభుత్వానికి వచ్చిన అత్యధిక ఆదాయం ఇదే. ఏప్రిల్ 2023లో GST సేకరణ వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 2023లో GST వసూళ్లు రూ.1,59,069 కోట్లకు చేరాయి.. ఈ సంఖ్య ఒక సంవత్సరం క్రితం అంటే ఆగస్టు 2022 కంటే 11 శాతం ఎక్కువ. అయితే గడిచిన 5 నెలల్లో GST వసూళ్లు రూ1.60 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. మార్చి 2023 నుంచి, GST వసూళ్లు నిరంతరంగా ప్రతి నెలా రూ.1.60 లక్షల కోట్లను దాటుతున్నాయి.
ఆగస్టులో కలెక్షన్లు ఇలా ఉన్నాయి
ఆగస్టు నెలలో కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.28,328 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.35,794 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.83,251 కోట్లు ప్రభుత్వానికి అందాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీలో వస్తువుల దిగుమతి ద్వారా రూ.43,550 కోట్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో, ప్రభుత్వం సెస్ ద్వారా రూ.11,695 కోట్లు ఆర్జించింది. ఇందులో దిగుమతుల ద్వారా రూ.1,016 కోట్లు వచ్చాయి.
తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉంది
దీనికి ఒకరోజు ముందు ప్రభుత్వం అధికారిక జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. NSO విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-34 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది వేగవంతమైన వృద్ధి రేటు. జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు బాగుంటుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 8 శాతంగా అంచనా వేసింది. అంటే తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు రిజర్వ్ బ్యాంక్ అంచనా కంటే కాస్త తక్కువగా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వృద్ధి రేటు వరుసగా 8 శాతం, 6.5 శాతం, 6 శాతం, 5.7 శాతంగా ఉండవచ్చు. ఈ విధంగా, ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.