Mukesh Ambani : ఆస్తులు పంచేస్తున్న ముకేశ్‌ అంబాని..మూడు సంస్థలుగా రిలయన్స్‌ వ్యాపారాల విభజన

భారత వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతోన్న ముకేశ్‌‌ అంబాని.. ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. జియో ఇన్ఫోకామ్‌కు ఆకాశ్‌ను చైర్మన్‌ చేయడంతో.. తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు. తన వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు పిల్లలకు పంచనున్నారు.

Mukesh Ambani : ఆస్తులు పంచేస్తున్న ముకేశ్‌ అంబాని..మూడు సంస్థలుగా రిలయన్స్‌ వ్యాపారాల విభజన

Mukesh Ambani Divide His Business Empire (1)

Mukesh Ambani divide his business empire  : భారత వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతోన్న ముకేశ్‌‌ అంబాని.. ఆస్తుల పంపకం మొదలుపెట్టారు. జియో ఇన్ఫోకామ్‌కు ఆకాశ్‌ను చైర్మన్‌ చేయడంతో.. తన అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు. తన వ్యాపారాలను మూడు విభాగాలు చేసి.. తన ముగ్గురు పిల్లలకు పంచనున్నారు. ఈ మూడు సంస్థలను మానిటర్ చేసేలా ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకీ ముకేశ్‌‌ నిర్ణయం వెనక వ్యూహం ఏంటి.. ఆయన ఏం చేయబోతున్నారు..

బాహుబలి సినిమా గుర్తుంది కదా.. సింహాసనం కోసం వారసుల మధ్య వైరం.. ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో.. ఎన్ని ప్రాణాలు తీసుకుందో చూశాం కదా ! వారసుల్లో ఎవరికి పట్టాభిషేకం చేయాలి.. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది మహారాజుకు కత్తిమీద సాము లాంటిదే. అది సినిమా అయినా.. నిజజీవితంలోనూ అలాంటి పరిణామాలే కనిపిస్తాయ్. బడా బడా వ్యాపారవేత్తలది అదే పరిస్థితి. రిలయన్స్ విషయంలో అది ప్రూవ్ అయింది. ధీరూభాయి అంబాని మరణం తర్వాత.. ముకేశ్‌‌, అనిల్ మధ్య జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ రెండు కుటుంబాల మధ్య దూరం ఉంది అంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ లెక్కలోకి తీసుకొని.. తన వారసుల విషయంలో ముకేశ్‌ అంబాని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆస్తుల పంపకంలో కొత్త స్ట్రాటజీ తీసుకువస్తున్నారు.

దేశంలోనే కాదు.. ఆసియాలోనే సంపన్నుడైన ముకేశ్‌ అంబాని… త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు అన్నిరంగాల్లోకి ప్రవేశించిన రిలయన్స్‌ సంస్థ రాబోయే రోజుల్లో మ‌రిన్ని రంగాల్లోకి విస్తరించాలని చూస్తోంది. ఇక అదే సమయంలో త‌న ఆస్తుల‌ను ముగ్గురు పిల్లల‌కు పంచే విష‌యంలోనూ ముకేశ్‌ అంబాని… చాలా తెలివిగా ప‌క్కా ప్రణాళికతో వ్యవహరించి.. రిల‌య‌న్స్ చీలిపోకుండా ఉండేందుకు అద్భుతమైన ఆలోచనలు చేస్తున్నారు. తన వారసులకు ఆస్తుల పంపకం ప్రక్రియను ముకేశ్‌‌ మొదలుపెట్టారు. టెలికం అనుబంధ విభాగమైన రిలయన్స్‌ జియోలో డైరెక్టర్‌ పదవికి రాజీనా చేసిన ఆయన.. జియో పగ్గాలను తనయుడు ఆకాశ్‌ అంబానికి అప్పగించారు. ఇక మరో కీలకమైన విభాగం రిటైల్‌ను ముకేశ్‌ కుమార్తె ఇషా చేపట్టనుంది.

Also read : Mukesh Ambani : ముఖేశ్ అంబానీ వారసుల చేతుల్లోకి రిలయన్స్ సంస్థలు..RIL మరింత పరుగులు పెట్టబోతోందా ?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ యాజమాన్యంలో… భారీ మార్పులకు ముకేశ్‌ అంబాని బాటలు వేశారు. పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానికి టెలికం విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు అనుగుణంగా టెలికాం బోర్డు నుంచి తప్పుకున్నారు. 217 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌.. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా, న్యూఎనర్జీ విభాగాల్లో విస్తరించింది. ఐతే తన వ్యాపార సామ్రాజ్యాన్ని.. ముగ్గురు పిల్లలకు సమంగా పంచడంతో పాటు.. భవిష్యత్‌లోనూ ఎలాంటి వివాదాలు రాకుండా.. రిలయన్స్‌ గ్రూప్ చీలిపోకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఆకాశ్‌ను ఇప్పుడు చైర్మన్‌ చేసినా.. ఇషాకు రిటైల్‌ బాధ్యతలు అప్పగించాలనున్నా.. అన్నింట్లోనూ ముకేశ్‌‌ ముందుచూపు కనిపిస్తోంది.

ముకేశ్‌‌ అంబాని ముగ్గురు సంతానంలో ఆకాశ్, ఈషా కవలలు. చిన్న కుమారుడు అనంత్‌. రిటైల్‌ బిజినెస్‌ పగ్గాలను ఈషాకు అప్పగించడం దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఆకాశ్, ఈషా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్ బోర్డులో ఉన్నారు. సూపర్‌ మార్కెట్లు, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫుట్‌వేర్, క్లాతింగ్‌ విభాగాలతో పాటు… ఆన్‌లైన్‌ రిటైల్‌ వెంచర్‌ జియో మార్ట్‌ కూడా రిలయన్స్‌ రిటైల్‌ కింద ఉంది. డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డులోనూ 2014 అక్టోబర్‌ నుంచీ వీరిద్దరూ కొనసాగుతున్నారు. 26 ఏళ్ల అనంత్‌ ఇటీవలే ఆర్‌ఆర్‌వీఎల్‌ బోర్డులో డైరెక్టరుగా చేరారు. 2020 మే నుంచి జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

రిలయన్స్‌ కంపెనీ ప్రధానంగా మూడు బిజినెస్‌ విభాగాలను నిర్వహిస్తోంది. చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం సహా… డిజిటల్‌ సర్వీసులు. రిటైల్, డిజిటల్‌ సర్వీసులను పూర్తి అనుబంధ ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉన్న మూడు బిజినెస్‌లు పరిమాణంలో సమానం. ఐతే గ్రూప్‌లోని ఆధునిక విభాగాలు రిటైల్, టెలికాంలలో ఆకాశ్, ఈషా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇక జియో ప్లాట్‌ఫామ్స్‌, పునరుత్పాదక విద్యుత్‌, చమురు, రసాయనాల వ్యాపారాల్లో అనంత్‌ కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఎవరు ఏ రంగంలో ఉన్నారో.. ఆ విధులు నిర్వర్తిస్తున్నారో.. పూర్తిగా వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని.. ముకేశ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఆకాశ్‌కు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ బాధ్యతలు అప్పగించడంతో ఆస్తుల పంపకం విషయంలో ముకేశ్‌ స్ట్రాటజీ స్పష్టంగా అర్థం అవుతోంది కూడా !

Also read : Mukesh Ambani : ముఖేశ్ అంబానీ రాజీనామా.. రిలయన్స్ జియో కొత్త చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
.
ముగ్గురు సంతానానికి ఆస్తులను సమానంగా పంచినా.. భవిష్యత్‌లో ఎలాంటి విభేదాలు రాకుండా, వచ్చినా పరిష్కరించేలా.. రిలయన్స్‌లో ఎప్పటికీ చీలిక రాకుండా ఉండేలా.. మూడు విభాగాలను మానిటర్ చేసేందుకు రిలయన్స్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలన్నరది ముకేశ్‌ అంబాని వ్యూహంగా కనిపిస్తోంది. ఆ ట్రస్ట్‌కు రిల‌య‌న్స్ కంపెనీ బాధ్యతలు అప్పగించే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రస్ట్‌లో ముకేశ్‌ అంబాని, ఆయ‌న స‌తీమ‌ణి, ముగ్గురు పిల్లల‌తో పాటు ఆయ‌న కుటుంబస‌భ్యులు, కొంత‌మంది ముఖ్యులు ఉంటార‌ని తెలుస్తోంది. రిల‌య‌న్స్‌లో ముకేశ్‌ అంబానికి 50శాతం వాటా ఉండ‌టంతో భ‌విష్యత్తులో రిల‌యన్స్ చీలిపోకుండా ఉండేందుకు అంబాని ఈ నిర్ణయం తీసుకోబోతోన్నార‌ని స‌మాచారం. అమెరికా రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ కూడా ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలింగ్‌ సంస్థ అయిన వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకులైన శామ్‌వాల్టన్‌ కూడా… తాను చనిపోయేందుకు 40ఏళ్ల ముందుగానే కుటుంబ వాటాలను ట్రస్ట్‌కు బదిలీ చేసి, కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టరు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ వాల్‌మార్ట్‌ సామ్రాజ్యం చీలిపోకుండా ఉందంటే.. ఆయన అనుసరించిన వారసత్వ ప్రణాళికే కారణం. ఇప్పటికీ వాల్‌మార్ట్‌లో 47శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూపంలోనే వాల్‌మార్ట్‌ కుటుంబీకులు కలిగి ఉన్నారు. ఇప్పుడు అంబాని కూడా అదే ఫార్ములా అనుసరించబోతున్నారు. 2002లో ధీరూభాయి అంబాని మరణం తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు.. ముకేశ్‌ ఛైర్మన్‌గా, అనిల్‌ అంబాని వైస్‌ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ధీరూభాయి ఎలాంటి వీలునామా రాయకపోవడంతో. కంపెనీకి సంబంధించి ప్రధాన నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి, మూడేళ్ల పాటు కొనసాగాయి. చివరికి తల్లి సమక్షంలో ఇద్దరూ ఆస్తులను పంచుకున్నారు. ఐతే అలాంటి సమస్య ఎప్పటికీ రావొద్దని.. ముకేశ్‌ ముందుగానే జాగ్రత్తపడుతున్నారు.