Hyderabad: నిర్మాణరంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్.. స్కైస్క్రాపర్స్‌ ఆఫీస్ స్పేస్‌లో భాగ్యనగరానిదే హవా

Hyderabad: నిర్మాణరంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్.. స్కైస్క్రాపర్స్‌ ఆఫీస్ స్పేస్‌లో భాగ్యనగరానిదే హవా

Hyderabad Skyscrapers Office Space

Hyderabad tall buildings: ఆకాశ హర్మ్యాలంటే ఒకప్పుడు విదేశాల్లోనే కనిపించేవి. కాని ఇప్పుడు మన దగ్గర కూడా స్కై స్క్రాపర్స్‌ (Skyscrapers)ను భారీగా నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో మేఘాలను తాకేలా ఆకాశ హర్మ్యాలను కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. భాగ్యనగరంలో అత్యధికంగా 58 అంతస్తుల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అయితే మన దేశంలో స్కై స్క్రాపర్స్‌ను ఎక్కువగా నివాసం కోసం ఉపయోగిస్తున్నారు. కానీ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలను ఆఫీస్ స్పేస్ కోసం వాడుతున్నారు. అది కూడా దేశంలోనే ఎక్కువ విస్తీర్ణంలో స్కైస్క్రాపర్స్‌లో కార్యాలయ కలాపాలు సాగేది హైదరాబాద్ లోనేనని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ సంస్థ సీబీఆర్‌ఈ ఏషియన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తెలిపింది. ఈ సంస్థ తాజాగా జూన్‌ త్రైమాసిక నివేదికను విడుదల చేసింది.

భారత్‌లో ఆకాశ హర్మ్యాలు ఎక్కువగా ఉన్న ముంబైలో ఆఫీస్ కార్యకలాపాలకు ఉపయోగించేది మాత్రం కేవలం 5 శాతం మాత్రమేనని సీబీఆర్ఈ తెలిపింది. అంటే అక్కడ 95 శాతం స్కైస్క్రాపర్స్‌ను నివాసం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. అదే హైదరాబాద్‌లో అయితే ఆకాశహర్మ్యాల్లోను ఆఫీస్ కార్యకలాపాలు ఎక్కువగా జరుపుతున్నారు. 10 నుంచి 15 శాతం స్కైస్క్రాపర్స్‌ను కార్యాలయాల కోసం వాడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టడం, పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో చాలా కంపెనీలు తమ కార్యాలయాలను భాగ్యనగరంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఇక మిగతా నగరాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్ అద్దె హైదరాబాద్‌లో కొంత మేర తక్కువని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుక గ్రేటర్ సిటీలో 15 శాతం మేర కార్యాలయాలు ఆకాశహర్మ్యాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: వృద్ధి బాటలో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్.. ఐదు రెట్లు పెరిగిన సేల్స్‌

ఇప్పటికే ఆఫీస్ స్పేస్ నిర్మాణం, లీజింగ్‌లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ కార్యకలాపాలు జరిగాయని సీబీఆర్‌ఈ ఇండియా తెలిపింది. స్కైస్క్రాపర్స్‌లో కార్యాలయాల ఏర్పాటులోను ముంబైని మించిపోవడం విశేషం. రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్ నిర్మాణం, లీజింగ్‌లో ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ నిలవడం ఖాయమని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కోటి రూపాయలకు మించి ధర ఉన్న ఇళ్లకు భారీ డిమాండ్.. హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..