ఫుల్ సెక్యూరిటీ : యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేశాయి

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 11:00 AM IST
ఫుల్ సెక్యూరిటీ : యాపిల్ క్రెడిట్ కార్డులు వచ్చేశాయి

టెక్‌దిగ్గజం యాపిల్‌ మరోసారి సంచలనానికి తెర తీసింది. త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది కంపెనీ.ఆర్థికపరమైన అంశాల్లో కస్టమర్లకు సాయం చేయడానికి ఓ కొత్త విధమైన ఆవిష్కరణకు తెరతీసినట్లు వెల్లడించింది కంపెనీ. కొత్త తరహా క్రెడిట్ కార్డుని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు 2019, మార్చి 25వ తేదీ  కాలిఫోర్నియాలో ఘనంగా ప్రకటించింది యాపిల్. దీని పేరు యాపిల్ కార్డు. క్రెడిట్ కార్డు కోసం గోల్డ్‌ మన్ శాక్స్‌, మాస్టర్‌ కార్డ్తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

వినియోగదారులు తమ ఐఫోన్ లోని వాలెట్ యాప్ లో.. యాపిల్ కార్డు కోసం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. కస్టమర్లకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ ఆప్షన్స్ ఉంటాయని వివరించింది. యాపిల్ కార్డు కొనుగోళ్లపై డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండనున్నాయి. క్యాష్ బ్యాక్ రివార్డ్స్ లా కాకుండా ఇది భిన్నంగా ఉంటుంది. యాపిల్ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ కస్టమర్లు సరైన సమయానికి పేమెంట్ చేయలేకపోతే.. పెనాల్టీ కూడా ఉండదని స్పష్టం చేసింది కంపెనీ.

ప్రతి ఒక్క లావాదేవీ సెక్యూర్ గా ఉంటుందని, ఇది ఫేస్ ఐడీ, టచ్ ఐడీ, వన్ టైమ్ యూనిక్ డైనమిక్ సెక్యూరిటీ కోడ్ ద్వారా ఆథరైజ్డ్ చేయబడుతుందని తెలిపింది. యాపిల్ పే.. పని చేయని లొకేషన్లలో షాపింగ్ కోసం ఓ టైటానియమ్ యాపిల్ కార్డు కూడా తీసుకురాబోతున్నది కంపెనీ. ఈ కార్డు నెంబర్, సీవీవీ సెక్యూరిటీ కోడ్, ఎక్స్ పైరీ డేట్, కార్డుపైన సంతకం లాంటివీ ఏమీ బయటకు కనిపించవు. ఇతర క్రెడిట్ కార్డులకన్నా అత్యంత సెక్యూర్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది. టైటానియమ్ యాపిల్ కార్డుతో లావాదేవీలు జరిపితే వినియోగదారులు ఒక శాతం డైలీ క్యాష్ బ్యాక్ పొందుతారు.