ఛలో గోవా: హైదరాబాద్‌లో తగ్గిన న్యూ ఇయర్ జోష్

మరి కొద్ది గంటల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిధ్దంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు సిధ్దమవుతంటే హైదరాబాద్ ఈ వేడుకలకు దూరంగా ఉంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎక్కడా పార్టీల ఏర్పాట్లు లేవు. పాసులు, పర్మిషన్ల ఊసేలేదు.. ఎవరిలోనూ ఆ జోష్ కనపడటంలేదు. ఏ ఈవెంట్ మేనేజర్లను టచ్ చేసినా నో రెస్పాన్స్. బార్‌కి వెళ్లినా, పబ్‌కి వెళ్లినా సందడి కనిపించడంలేదు. ఇంతకీ ఆ జోష్ తగ్గడానికి కారణాలేంటి? మరి.. పార్టీల మాటేంటి?
ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన 2019 మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. మరెన్నో ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు, ఆలోచనలు, సరికొత్త కార్యాచరణలతో 2020 మన ముందుకు రాబోతోంది. న్యూ ఇయర్‌ను సాదరంగా ఆహ్వానించేందుకు ప్రపంచమంతా రెడీ అయింది. హైదరాబాద్‌లో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు.
గత ఏడాదితో పోల్చితే ఈసారి న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లు సిటీలో అంతగా కనిపించడం లేదు. ఈవెంట్ మేనేజర్లు కూడా వాటి జోలికి పోవడం లేదు. ఒక పక్కన పోలీసుల నిఘా, మరో పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ లు, దీనికి తోడు భారీ బడ్జెట్. దీంతో పెట్టుబడిగా పెట్టిన డబ్బు కూడా వచ్చేలా కనపడక పోవడంతో పబ్స్, రిసార్ట్స్ యాజమాన్యాలు పార్టీల మాటే ఎత్తడంలేదు. దీంతో ఎక్కడా హడావిడి కనిపించడం లేదు.
ఓవైపు… సెలబ్రెటీల రెమ్యునరేషన్ చుక్కలనంటడం, మరోవైపు పోలీసుల ఆంక్షలు కూడా న్యూఇయర్ జోష్‌కి బ్రేకులు వేశాయి. ఈవెంట్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు.. వాటిని ఎప్పటికప్పుడు వాచ్ చేసేలా ఐపీ నెంబర్లు పోలీసులకు ఇవ్వాలని, లిక్కర్ లిమిట్‌గా అందించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో తప్ప ఇతరచోట్ల ఈవెంట్ల కోసం పెద్దగా పర్మిషన్లు కోరలేదు నిర్వాహకులు.
హైదరాబాద్‌లో అనుకున్నన్ని ఈవెంట్లు లేకపోవడంతో పార్టీ పీపుల్స్.. చలో గోవా అంటున్నారు. ముందుగానే అక్కడికి చేరుకొని వేడుకలు ముగిసాక ఇంటికి చేరేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు భయపడి మరికొందరు ఇంట్లోనే పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
న్యూ ఇయర్ వేడుకల చేసుకుందామని సిటీ పీపుల్ సిద్ధమవుతుంటే… పోలీసులు మాత్రం వారి స్పీడ్‌కు బ్రేకులు వేయడంపై దృష్టిపెట్టారు. కొత్త ఆశలతో నూతన సంవత్సరంలోకి అడగుపెట్టబోతున్న తరుణంలో చిందులు వేసే యూత్‌కు షాకిస్తున్నారు. డిసెంబర్31 రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు పేరుతో ఫ్లై ఓవర్లను క్లోజ్ చేయడంతోపాటు మరికొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సెలబ్రేషన్స్ పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే తాటతీస్తామని హెచ్చరిస్తున్నారు.
నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈవెంట్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. సైబరాబాద్ పరిధిలో అన్ని ఫ్లై ఓవర్లను సాయంత్రం నుంచే మూసివేస్తామని.. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి ఎయిర్ పోర్ట్ వెళ్లే వారు ఫ్లయిట్ టికెట్ వివరాలు చూపిస్తేనే అనుమతి ఉంటుందన్నారు.
మద్యం సేవించిన వారు క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవాలంటున్నారు పోలీసులు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూఇయర్ ఈవెంట్స్, పబ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు… అనుమతి లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో డిసెంబర్31, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుఝూమున 5 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న రహదారులను వదిలేసి ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లైట్ మోటర్ వెహికిల్స్‌ను అనుమతించరు. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపైనా వాహనాల రాకపోకలకు అనుమతివ్వరు. కేవలం శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వారికి మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపైకి అనుమతిస్తారు. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్లు, తెలుగుతల్లి, కామినేని, ఎల్బీనగర్, పంజాగుట్ట ఫ్లైఓవర్లతోపాటు నల్గొండ చౌరస్తా పైవంతెన, చింతల్‌కుంట అండర్ పాస్‌లను మూసివేయనున్నారు.
వాహనాల వేగాన్ని నియంత్రించడం కోసం పలుచోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 నుంచి అర్థరాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పైకి వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించారు. ఆ దారుల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నయమార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.