కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు : స్టాక్ మార్కెట్ జోరు

  • Published By: madhu ,Published On : September 20, 2019 / 07:54 AM IST
కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు : స్టాక్ మార్కెట్ జోరు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్‌లో ఫుల్ జోష్ పెంచాయి. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరటనిస్తూ సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి నిర్మలా ఓ ప్రకటన చేశారు. దీంతో మార్కెట్ లాభాల బాటలో ట్రేడ్ అవుతోంది. కేవలం..కొద్ది నిమిషాల్లో ముదుపర్ల సంపద రూ. 5 లక్షల కోట్లకు పైగా పెరగడం గమనార్హం. ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళన వ్యక్తం కావడంతో మార్కెట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. 

ఆర్థిక మాంద్యం దేశాన్ని కలిచివేస్తోంది. మందగమన దిశలోకి వెళుతుండడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. వివిధ రంగాలకు ఊతమివ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించింది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్లకు ఎగబాకింది. BSE మార్కెట్ విలువ రూ. 143.45 లక్షల కోట్లకు పెరిగింది.

నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఇంతగా భారీగా లాభపడడం ఇదే తొలిసారి అని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. సెన్సెక్స్ 1778 పాయింట్ల లాభంతో 37 వేల 872 వద్ద, నిఫ్టీ 524 పాయింట్ల లాభంతో 11 వేల 229 వద్ద ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో కార్ప్, అదానీ స్టోర్స్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్, ఇండియా బుల్స్, ఆటో, సిమెంట్ తయారీ కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. రూపాయి విలువ కూడా లాభాల్లో కొనసాగుతోంది. 
Read More : ముందే చక్కబెట్టుకోండి : 7 రోజుల్లో.. 6 రోజులు బ్యాంకులకు సెలవు