Airtel-Jio-Tata Play Row : బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై టెలికోల మధ్య వార్.. లైవ్ టీవీ ఛానళ్లను కలపొద్దు.. జియో, ఎయిర్‌టెల్‌పై టాటా ప్లే ఫైర్..!
Airtel-Jio-Tata Play Row : టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులపై పరస్పర ఆరోపణలకు దిగాయి. ఈ రెండింటి పంచాయితీ ట్రాయ్ దగ్గరకు చేరింది. డీటీహెచ్ ఆపరేటర్ టాటా ప్లే (Tata Play) కూడా టెలికోలు అందించే బ్రాడ్ బ్యాండ్ ప్యాకేజీలను తీవ్రంగా తప్పుబట్టింది.

Tata Play Accuses Airtel, Jio for Bundling Live TV Channels with Broadband
Airtel-Jio-Tata Play Row : దేశీయ టెలికం దిగ్గజాలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను గుప్పిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్ బట్టి ఆయా ప్లాన్లపై ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. టెలికం వినియోగదారులను ఆకట్టుకోవడంలో దేశీయ అతిపెద్ద డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే జియో తమ బ్రాండ్‌బ్యాండ్ సర్వీసు (Jio Fiber) ద్వారా లైవ్ టీవీ (Live TV) ఛానెళ్లను అందిస్తోంది.
జియో ఫైబర్ ప్లాన్లపై మరో పోటీదారు ఎయిర్‌టెల్ (Airtel) తీవ్రంగా వ్యతిరేకించింది. జియో ఫైబర్ సర్వీసులను సరసమైన ధరలకు అందించడాన్ని ఎయిర్‌టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)కు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్ ఫిర్యాదుపై జియో కౌంటర్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ ఓర్వలేకనే ఇలా తమపై ఆరోపణలు చేస్తుందని ట్రాయ్‌కు జియో ఫిర్యాదు చేసింది. రెండు టెలికం దిగ్గజాలు ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకున్నాయి.
దోపిడీ ధరలతో చిన్న ఆపరేటర్ల పరిస్థితి ఏంటి? : టాటా ప్లే
జియో, ఎయిర్‌టెల్ మధ్య డీటీహెచ్ ప్రైస్ వార్ నేపథ్యంలో ఇప్పుడు భారత అతిపెద్ద DTH ఆపరేటర్, టాటా ప్లే (Tata Play) (గతంలో టాటా స్కై) వచ్చి చేరింది. లైవ్ టీవీ ఛానెల్‌లు, ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లను సంబంధిత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లతో కలపడాన్ని టాటా ప్లే తీవ్రంగా ఖండించింది. జియో, ఎయిర్‌టెల్ రెండూ దోపిడీ ధరలతో సర్వీసులను అందిస్తాయని తప్పుబట్టింది. ఇదే క్రమంలో ఎయిర్‌టెల్, జియో రెండింటిపై టాటా ప్లే చేసిన విమర్శలు మరింత హీట్ పెంచాయి. బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలలో లైవ్ TV ఛానెల్‌లు, OTT యాప్‌లను చేర్చడాన్ని దోపిడీ ధరలుగా టాటా ప్లే విమర్శలు చేసింది.
దీని కారణంగా చిన్న ఆపరేటర్‌లను మార్కెట్ నుంచి నిష్ర్కమించేలా చేస్తుందని డీటీహెచ్ ఆపరేటర్ మండిపడింది. టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్ గత మార్చిలోనూ ట్రాయ్ ఇదే అంశంపై లేఖ రాశారు. మార్కెట్లో బ్రాడ్‌కాస్టర్‌లు, టీవీ ఛానెల్‌లతో ధరలను చర్చించే స్వేచ్ఛను DTH ప్లేయర్‌లు కలిగి ఉండాలని నాగ్‌పాల్ సూచించారు. లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లతో అందించే JioFiber, Airtel Black ప్లాన్‌లకు సంబంధించి అంశాలను (Tata Play) లేఖలో ప్రస్తావించింది. ఈ ఆఫర్‌లు DTH వ్యాపారానికి హానికరమని పేర్కొంది.

Tata Play Accuses Airtel, Jio for Bundling Live TV Channels with Broadband
ఎయిర్‌టెల్ ఫిర్యాదుపై జియో ఫైర్..
ఇప్పటికే జియో ఫైబర్ (Jio Fiber) హోం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల్లో లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీ కంటెంట్ అందిస్తుంటే.. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ కూడా తమ (Airtel Black) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో లైవ్ టీవీ ఛానళ్లు, ఓటీటీని కలిపి మిక్సడ్ కంటెంట్ అందిస్తోంది. జియో పోటీదారుగా ఎయిర్‌టెల్ జియో బ్యాకప్ ప్లాన్‌లను నిరోధించవలసిందిగా ట్రాయ్‌ను అభ్యర్థించింది. ఎయిర్ టెల్ ఆరోపణలను తిప్పికొడుతూ జియో కూడా ట్రాయ్‌కు లేఖ రాసింది. ఎయిర్‌టెల్ పనికిమాలిన ఫిర్యాదులను దాఖలు చేసిందని ఆరోపించింది. భవిష్యత్తులోనూ ఎయిర్‌టెల్ ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఉండేలా హెచ్చరించాలని రెగ్యులేటర్‌ను జియో కోరింది.
వాస్తవానికి.. సెట్-టాప్ బాక్స్ (STB) ద్వారా OTT (ఓవర్-ది-టాప్) యాప్ నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జియో అందిస్తుంది. మార్కెట్ ధర కన్నా తక్కువగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలో 400-550 లైవ్ టీవీ ఛానెల్‌లను జియో ఆఫర్ చేస్తోంది. తద్వారా మార్కెట్లో పోటీని తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఎయిర్‌టెల్ ఆరోపించింది. TTO-1999కి విరుద్ధంగా ఉందని, ట్రాయ్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎయిర్‌టెల్ కోరింది.
జియో మాత్రం ఎయిర్‌టెల్ ఆరోపణలను తోసిపుచ్చింది, ఎయిర్‌టెల్ ఫిర్యాదును రిలయన్స్ జియో సంకుచిత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటుందని విమర్శించింది. ఎయిర్ టెల్ ఫిర్యాదుపై TRAI చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. ఏది ఏమైనప్పటికీ.. భారత టెలికాం రంగంలో మరింత పోటీతత్వాన్ని పెంచనుంది. టెలికం ఆపరేటర్లు ఆకర్షణీయమైన ధరలకు బండిల్ సర్వీసులను అందించడం ద్వారా మార్కెట్ వాటా కోసం పోటీ పడుతున్నారు.