నాంపల్లిలో నేటి నుంచి నుమాయిష్

  • Published By: chvmurthy ,Published On : January 1, 2020 / 03:31 AM IST
నాంపల్లిలో నేటి నుంచి నుమాయిష్

హైదరాబాద్ నగర ప్రజలను 46 రోజులపాటు  అలరించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్ లో నేటినుంచి నుమాయిష్  ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు.  నుమాయిష్‌ను ప్రతి ఏటా దాదాపు 20 లక్షలకు పైచిలుకు సందర్శకులు  సందర్శిస్తారు. గత సంవత్సరం ఎగ్జిబిషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా సొసైటీ ప్రతినిధులు ఈ ఏడాది భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు.

అందులో భాగంగా లక్షన్నర నీటి సామర్థ్యం కలిగిన రెండు సంపుల నిర్మాణం, భూగర్భ విద్యుత్‌ కేబుల్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి స్టాల్‌ హోల్డర్‌కు బీమా ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ఉన్న ప్రవేశమార్గాలకు అదనంగా మరో ఆరు మార్గాలను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ, పోలీస్‌ శాఖ వాహనాలు తిరిగే విధంగా మైదానంలో స్టాళ్ల సంఖ్యను తగ్గించి వీధులను విశాలంగా ఉంచారు.

 

గతంలో ఎగ్జిబిషన్‌లో దాదాపు 2500 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. ఈ ఏడాది వాటిని కుదించి 1500 నుంచి 2000 వరకు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు నిరంతర నిఘా, సీసీ కెమెరాలతో నిఘా, సెక్యూరిటీ తనిఖీలు, వాచ్‌ అండ్‌ వార్డ్‌ సిబ్బందితో స్టాళ్లలో సిలిండర్లను ఏర్పాటు చేయకుండా నిరంతరం తనిఖీలు చేపట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వివిధ శాఖల అధికారులు పలుమార్లు ఎగ్జిబిషన్‌ మైదానాన్ని సందర్శించిన అనంతరం అనుమతులను మంజూరు చేశారు. భద్రతా చర్యలపై న్యాయస్థానానికి అధికారులు నివేదిక సమర్పించడంతో న్యాయస్థానం ఎగ్జిబిషన్‌ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఈ సంవత్సరం పబ్లిక్‌ లయబిలిటీ కింద ఐదు కోట్ల రూపాయల వరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా ప్రతి స్టాల్‌ హోల్డర్‌ తక్కువ ప్రీమియంతో స్టాల్‌కు ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సొసైటీ నిర్ణయించింది. అంతేకాకుండా స్టాల్‌లో తప్పనిసరిగా ఫైర్‌ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని కచ్చితమైన నిబంధన పెట్టింది. స్టాల్‌ హోల్డర్లు ఫైర్‌ సేఫ్టీ చర్యలు తీసుకోని పక్షంలో వారికి విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని సొసైటీ నిర్ణయించింది.
 

ఈ సంవత్సరం కూడాఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చే విధంగా సొసైటీ అన్నిచర్యలు తీసుకుంటోంది. ఎగ్జిబిషన్‌ నిర్వహణ సందర్భంగా సందర్శకుల సౌకర్యార్థం మెట్రో రైలు గత సంవత్సరం మాదిరిగానే రాత్రి పదకొండు గంటల వరకు రైళ్లను నడపుతోంది. ఇప్పటికే నుమాయిష్‌లో స్టాళ్ల కేటాయింపు పూర్తిఅయి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.
 

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సందర్భంగా నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశమార్గంలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మైదానం లోపలికి అనుమతిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది, వాచ్‌ అండ్‌ వార్డు సిబ్బంది అనుక్షణం మైదానంలో తిరుగుతూ పరిశీలిస్తారు. స్టాళ్లలో వంట చేసుకునేందుకు గ్యాస్‌ సిలిండర్లను తీసుకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మైదానంలో పలు ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు.