Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
Tesla employees : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి.

Tesla employees : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో ఇప్పటికే దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా కోరుతున్నాయి. అందులో టెస్లా కంపెనీ ఒకటి.. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ టెస్లా ఉద్యోగుల కష్టాలు మామూలుగా లేవు.. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కంపెనీ ఉద్యోగులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇంటి దగ్గర నుంచే పనిచేస్తామంటే లేదు.. ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే జాబ్ మానేయాలంటూ హెచ్చరించాడు.
దాంతో టెస్లా ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో తిరిగి ఆఫీసులకు చేరుకుంటున్నారు. మొన్నటివరకూ ఇంటికే పరిమితమైన టెస్లా ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారంతా తిరిగి ఆఫీసు వస్తే కనీసం అక్కడ కూర్చొనేందుకు సీట్లు కూడా లేవట.. అంతేకాదు.. తమ కార్లను పార్క్ చేసేందుకు పార్కింగ్ స్పేస్ కూడా లేదని వాపోతున్నారు. వాహనాల పార్కింగ్ దగ్గర నుంచి ఆఫీసుల్లో కూర్చొనే కూర్చీలు, డెస్కల వరకు ఏది సరైన సౌకర్యాలు అందుబాటులో లేవు. అయినప్పటికీ అదే పరిస్థితుల్లో టెస్లా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

Tesla Employees Had No Place To Sit, No Parking Slots When They Returned To Office
ఓ నివేదిక ప్రకారం.. టెస్లా ఫ్రీమాంట్, కాలిఫోర్నియా ఆఫీసుకు తిరిగి వచ్చిన టెస్లా ఉద్యోగులకు కూర్చోవడానికి కూడా స్థలం లేదని ఫిర్యాదు చేశారు. తమ కార్లు పార్క్ చేయడానికి స్థలం లేదని వాపోయారు. వర్క్ డెస్క్ కొందరికి మాత్రమే అందుబాటులో ఉండగా.. వైఫై సౌకర్యం కూడా సరిగా లేదని అంటున్నారు. టెస్లా ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయితే ఆఫీసుల్లో లాజిస్టిక్స్ ఏర్పాటు చేసేవరకు ఇంటి నుంచి పని కొనసాగించమని ఉద్యోగులను కోరారు. రెండేళ్లలో టెస్లా ఉద్యోగుల సంఖ్య రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం 99,210 మంది ఉద్యోగులు ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ నివేదిక ప్రకారం.. టెస్లా రాబోయే మూడు నెలల్లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తుందని మస్క్ చెప్పారు. అందులో దాదాపు 3.5 శాతం వరకు ఉద్యోగాల కోతలే ఉంటాయి. గత రెండేళ్లలో టెస్లాలో అధిక నియామకాలు చేపట్టడంతో డెస్క్‌లో ఈ సమస్యలకు దారితీసింది. ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పని చేయించడంలో మస్క్ ప్రణాళికలు విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటి నుండి పని ఇకపై ఆమోదయోగ్యం కాదని మస్క్ గతంలోనే తేల్చి చెప్పేశారు. ఉద్యోగులంతా తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆఫీసులకు రావడం ఇష్టపడని ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకోవచ్చని ఆయన ఈమెయిల్లో పేర్కొన్నారు. టెస్లా ఉద్యోగులకు వారానికి 40 గంటల పని తప్పనిసరి చేశాడు. రిమోట్ పని ఇకపై ఆమోదయోగ్యం కాదని మస్క్ ఈమెయిల్లో తెలిపాడు. అలా ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం కనీసం వారానికి 40 గంటలు ఆఫీసుల్లో ఉండాలి లేదా టెస్లా నుంచి ఉద్యోగం మానేయాలన్నాడు మస్క్. దాంతో చేసేది ఏమిలేక ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తున్నారు.
Read Also : Elon Musk : మరో 3 నెలల్లో 10శాతం టెస్లా ఉద్యోగుల కోత తప్పదు..!