కౌన్సెలింగ్ ఇచ్చినా కాంప్రమైజ్ కాలేదు..పోలీసుల ఎదుటే బాహా బాహీ

  • Published By: murthy ,Published On : July 14, 2020 / 11:39 AM IST
కౌన్సెలింగ్ ఇచ్చినా కాంప్రమైజ్ కాలేదు..పోలీసుల ఎదుటే బాహా బాహీ

ఈ రోజుల్లో ఎవరికీ ఓర్పు, సహనం ఉండటం లేదు. ఆవేశాలతో జీవితాలు బుగ్గి చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వారి మధ్య వచ్చిన విభేదాలతో… ఆవేశంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకునే దాకా వెళ్లటంతో రెండు కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగింది. చివరికి పోలీసుల ఎదుటే రెండు కుటుంబాల వారు కొట్టకోవటంతో వారికి సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

తూప్రాన్‌ మండలం జెండాపల్లికి చెందిన యువతిని నాలుగు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. వీరి కాపురం నాలుగు నెలల నుంచి సజావుగా సాగుతుండగా ఇటీవల భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని యువతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు తూప్రాన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సోమవారం జులై13న పోలీసులు కొత్త దంపతులతో పాటు ఇరు వైపులా కుటుంబ సభ్యులను పిలిచి పెద్దల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్ళీ నెల రోజుల తర్వాత కలుద్దామని చెప్పి వారిని పంపించి వేశారు. పోలీసు స్టేషన్ బయటకు రాగానే కోపోద్రిక్తులైన అమ్మాయి తరుఫువారు అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేయబోయారు. ఇది గమనించిన పోలీసులు అలర్టై ఇద్దరికి సర్ది చెప్పి పంపించి వేశారు.

అబ్బాయి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్ కు బయలుదేరారు. వారిని వెంబడించిన అమ్మాయి కుటుంబ సభ్యులు తూప్రాన్ పట్టణంలోని శివాలయం వద్ద కారు అడ్డగించి, దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దారు పగిలి పోగా అబ్బాయి ని బయటకు లాగి చితక బాదారు. ఈ లోగా స్దానికులు అమ్మాయి తరుఫు వారిని అడ్డుకుని అబ్బాయిని రక్షించారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.