మటన్ లో బీఫ్ కలిపి అమ్మకాలు, హైదరాబాద్ లో దారుణం, అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు

మటన్ లో బీఫ్ కలిపి అమ్మకాలు, హైదరాబాద్ లో దారుణం, అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు

మీరు మటన్ ప్రియులా. మటన్ బాగా తింటారా. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని లాగించేస్తున్నారా. అయితే జర జాగ్రత్త. ఓసారి మటన్ కొనేముందు చెక్ చేసుకోండి. మీరు తింటున్నది మటనో కాదో తెలుసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు తింటున్నది మటన్ కాదు బీఫ్(గొడ్డు మాంసం). ఏంటి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. హైదరాబాద్ లో మటన్ పేరుతో జరుగుతున్న దందా వెలుగు చూసింది. పశుసంవర్థక శాఖ అధికారుల తనిఖీల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. వ్యాపారులు మటన్(గొర్రె, మేక మాంసం) లో బీఫ్ కలిపి అమ్ముతున్న విషయం బహిర్గతమైంది. మటన్-బీఫ్ మిక్సింగ్ మాఫియా గుట్టురట్టయింది.

మటన్ దుకాణం పేరుతో బీఫ్ అమ్మకాలు:
మాంసం అమ్మకాలు, అక్రమాలు, అధిక ధరలపై పరిశీలన కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.బాబు బేరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వెటర్నరీ అధికారుల కమిటీ మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీలో విస్తృత తనిఖీలు చేస్తోంది. ఈ పరిశీలనలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు చోట్ల మటన్ దుకాణం పేరుతో బీఫ్ అమ్మకాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. అదే సమయంలో మేక, గొర్రె మాంసంలో బీఫ్ కలిపి అమ్ముతున్నారు.

50 మటన్‌ దుకాణాలకు లైసెన్సులే లేవు:
ఆసిఫ్ నగర్‌, బార్కాస్‌, మణికొండ, జియాగూడ, గోల్కొండ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, అంబర్‌పేట్‌, నాంపల్లి, రెడ్‌హిల్స్‌, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని పలు మటన్‌ దుకాణాల్లో బీఫ్‌(గొడ్డు మాంసం) అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన ఓ చోట క్వింటాలు మటన్‌పై ఫినాయిల్‌ పోశారు. 62 మాంసం దుకాణాలను తనిఖీ చేస్తే.. వాటిలో 50 మటన్‌ దుకాణాలకు లైసెన్సులే లేవు. మరికొందరేమో చికెన్‌షాపు పేరిట మటన్‌ అమ్ముతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి మటన్‌ షాపులకు లైసెన్సు తీసుకోవాల్సి ఉండగా రెండు, మూడు నెలలకోసారి నామమాత్రపు జరిమానా చెల్లిస్తూ దుకాణాలను నడిపిస్తున్నారు. ఈ తరహా దందా కొన్నేళ్లుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కరోనా వేళ మటన్ ధరలకు రెక్కలు:
ఇదిలా ఉండగా కరోనా విపత్తు సమయంలో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో మటన్ ధరను రూ.800 నుంచి రూ.950 లకు అమ్ముతున్నారు. రాష్ట్ర పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇతర అధికారులతో చర్చించి మటన్ కిలో రూ.700, చికెన్ కిలో రూ.160కి మించి అమ్మరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఒక దుకాణంలో అయితే కంపెనీ బ్రాండ్ పేరుతో కిలో మటన్‌ని రూ.1,100 కు అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా అక్రమ వ్యాపారం సాగించినట్లైతే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారులు దుకాణ దారులను హెచ్చరించారు.

వ్యాపారులు మాంసాన్ని సగటున కిలో రూ.350 నుంచి రూ.450 వరకు కొంటున్నారు. వినియోగదారులకు మాత్రం రెండింతల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మాంసానికి తోడు తల, కాళ్లు, తోలు, పొట్ట పేగులు వేరుగా విక్రయించటం ద్వారా గొర్రెలు, మేకలు కొనటానికి పెట్టిన పెట్టుబడిపై మూడింతల ఆదాయాన్ని పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు.

”మాసం దుకాణాలు, ప్రభుత్వ స్లాటర్‌ హౌజ్‌లు, అక్రమ స్లాటర్‌ హౌజ్‌లు, మాంసం రవాణా, గొర్రెలు, మేకలు కోస్తున్న తీరు.. అన్నీ పరిశీలన చేస్తున్నాం. చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మటన్‌లో బీఫ్‌ కలుపుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అలాంటి వ్యాపారులను గుర్తించి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించాం. అన్ని అంశాలపై 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. మాంసం విక్రయాలను వెటర్నరీ శాఖ పరిధిలోకి తీసుకొచ్చే విధానంపై సిఫార్సులు చేస్తాం” అని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాబు బేరి తెలిపారు.

లాక్ డౌన్ కొందరికి శాపంగా మారితే కొందరికి వరంగా మారింది. మటన్ వ్యాపారులు లాక్ డౌన్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ధరలు బాగా పెంచి దోచుకుంటున్నారు. అదే సమయంలో మటన్ లో బీఫ్ కలిపి అమ్మకాలు జరుపుతున్నారు. ఇంకొందరు మటన్ షాపుల పేరుతో బీఫ్ అమ్మకాలు జరుపుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో జనాలు చికెన్ తినడం తగ్గించారు. చికెన్ తింటే కరోనా వస్తుందనే అపోహతో చికెన్ జోలికి వెళ్లడం లేదు. చికెన్ ప్రియులు సైతం మటన్ వైపు మొగ్గారు. దీంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. సరిగ్గా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. మటన్ లో బీఫ్ కలిపి అమ్ముతున్నారనే వార్త మటన్ ప్రియులను కలవరపెడుతోంది. మటన్-బీఫ్ మిక్సింగ్ మాఫియాని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.