Bengaluru Woman: బైక్ నుంచి కిందకు దూకేసి.. తెగువ చూపిన బెంగళూరు మహిళ..

బెంగళూరు మహిళ బైకుపై నుంచి కిందకు దూకేసిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు స్పందిస్తున్నారు.

Bengaluru Woman: బైక్ నుంచి కిందకు దూకేసి.. తెగువ చూపిన బెంగళూరు మహిళ..

బైక్ నుంచి దూకేసిన తర్వాత బాధితురాలు (Screengrab from video tweeted by ANI)

Bengaluru Bike Rider Case: బైక్ ట్యాక్సీ రైడర్ నుంచి తప్పించుకునేందుకు సాహసం చేసిన బెంగళూరు మహిళపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆపద నుంచి ఆమె గట్టెక్కిందని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో మహిళల భద్రత (Women Security)పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సేవలు అందిస్తున్న ప్రైవేటు అగ్రిగేటర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. రైడర్లను ఎంపిక సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది?
బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మహిళల భద్రతపై ఆందోళన రేపింది. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న ఓ మహిళ ఇందిరానగర్ వెళ్లడానికి ఈనెల 21 రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. రాత్రి సమయం కావడంతో బైక్ ట్యాక్సీ రైడర్ (Bike Taxi Rider).. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా ఆమె వెళ్లాల్సిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీని గురించి ఆమె ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా, బైక్ వేగం మరింత పెంచి మరో మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

భయాందోళన చెందిన ఆమె.. ఉన్నపళంగా బైకు మీద నుంచి కిందకు దూకేసింది. దుండగుడు ఆమెను వదిలేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దీపక్ ను అరెస్ట్ చేశారు. అతడిపై వేధింపులు, లైంగికదాడి యత్నం, కిడ్నాప్ కేసులు పెట్టి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి
ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియా (Social Media)లో నెటిజనులు స్పందిస్తున్నారు. సరైన సమయంతో తెగువ ప్రదర్శించి బాధితురాలు ఆపద నుంచి బయటపడిందని ఎక్కువ మంది నెటిజనులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బైక్ ట్యాక్సీలపై ప్రయాణించేటప్పుడు మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బైక్ ట్యాక్సీ రైడర్లను ఎంపిక చేసేటప్పుడు కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Also Read: 40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కంగుతిన్న అధికారులు

బైక్ టాక్సీలకి ప్రభుత్వం బ్రేక్ వేయాలి
వ్యక్తిగత బైక్ ఎలా టాక్సీ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ (Self Drive) అయితే ఫర్వాలేదు కానీ, బైక్‌లో తెలియని వ్యక్తితో మహిళలు ఎలా ప్రయాణించగలని అడుగుతున్నారు. సమయాన్ని, డబ్బును ఆదా చేయడం కోసం భద్రతతో రాజీ పడడం సముచితం కాదంటున్నారు. బైక్ టాక్సీలకి ప్రభుత్వం బ్రేక్ వేయాలని కోరుతున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరి యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని పోకిరీ డ్రైవర్లు రెచ్చిపోతున్నారని, పోలీసులు గస్తీని ముమ్మురం చేయడం ద్వారా ఇలాంటి వారి ఆట కట్టించవచ్చని చెబుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.