గాంధీలోనే మృతదేహాలు : ఆఖరి చూపు కోసం చెన్నకేశవుల భార్య ఎదురుచూపులు

దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 03:42 AM IST
గాంధీలోనే మృతదేహాలు : ఆఖరి చూపు కోసం చెన్నకేశవుల భార్య ఎదురుచూపులు

దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా… ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు

దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా… ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు కాస్తున్నారు. కోర్టు ఆదేశాలతో  మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతున్నకొద్దీ వారు అల్లాడిపోతున్నారు. మృతదేహాలను త్వరగా అప్పగించాలని కోరుతున్నారు. కోర్టులు డెడ్‌బాడీల అప్పగింతపై వాయిదాలు వేస్తుండడంతో వారు ఒకింత  అసహనానికి గురవుతున్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ డిసెంబర్ 6న జరిగింది. ఎన్‌కౌంటర్‌ జరిగి ఎనిమిది రోజులు అయ్యింది. అయినా ఇంకా వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. కోర్టు ఆదేశాలతో మృతదేహాల అప్పగింత వాయిదా పడుతూ వస్తోంది. తొలుత 9వ తేదీ రాత్రి వరకు మృతదేహాలను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత మరికొన్ని రోజులు భద్రపర్చాలని ఆదేశించింది. ఇప్పుడు ఆ సమయం మరికొన్ని రోజులు పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాలను భద్రపర్చాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దిశ హత్య నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే మగ్గుతున్నాయి. 

మృతదేహాల అప్పగింత వాయిదాలపై వాయిదా పడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని కడసారి చూపు చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు.  ఎన్‌కౌంటర్‌ జరిగి వారం రోజులు అవుతున్నా… ఇప్పటివరకు కడసారి చూపుకు నోచుకోలేదని ఆవేదన చెందుతున్నారు.. తమ పిల్లలను ఆఖరి చూపు చూడడానికి వచ్చిన బంధువులకు మృతదేహాలు ఇంతవరకు  రాలేదని తెలియడంతో తిరిగి వెళ్తున్నారని, ఉన్నవారు పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి తమ పిల్లల మృతదేహాలను తమకు అప్పగించాలని. కోరుతున్నారు. 

దిశ హత్య కేసులో నిందితుల కుటంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని హైకోర్టు న్యాయవాది కృష్ణమాచారి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన తన అసిస్టెంట్‌… జూనియర్‌  న్యాయవాది రజినీని నిందితుల స్వగ్రామాలకు పంపారు. నిందితుల కుటుంబాల నుంచి ఆమె సంతకాలు సేకరించారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు ఆమె తెలిపారు.

ఏదేమైనా ఎన్‌కౌంటర్‌ జరిగిన వారం రోజులవుతున్నా నిందితుల మృతదేహాలను అప్పగించకపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టెడు శోకంలో ఉన్న తమకు… కనీసం తమవారిని  చూసుకునే భాగ్యం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.