Maharashtra : మహారాష్ట్రలో మరోసారి రెచ్చిపోయిన కొడవళ్ల గ్యాంగ్.. మెడికల్ షాప్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి

గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి. ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి.

Maharashtra : మహారాష్ట్రలో మరోసారి రెచ్చిపోయిన కొడవళ్ల గ్యాంగ్.. మెడికల్ షాప్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి

Maharashtra (1)

Maharashtra : మహారాష్ట్రలో కొడవళ్ల గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. కొందరు వ్యక్తులు కొడవళ్ల వంటి కత్తులు చేతబట్టుకుని మెడికల్ షాప్ లోకి ప్రవేశించారు. షాప్ లోని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడంతోపాటు వారిపై దాడి చేశారు. ఈ ఘటన పూణె జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శనివారం ఆరుగురు వ్యక్తులు కొడవళ్లు చేతపట్టుకుని పింప్రి చించ్ వాడ్ లోని ఒక మెడికల్ షాపులోకి చొరపడ్డారు.

మెడికల్ షాపులోని సిబ్బందిపై కొడవళ్లతో దాడి చేశారు. వారిని బెదిరించడంతోపాటు మెడికల్ షాప్ ను ధ్వంసం చేశారు. భయాందోళనకు గురైన మెడికల్ షాపు సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మెడికల్ షాపులోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు.

Wrestlers vs WFI: లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆ ఏడుగురు మహిళా రెజ్లర్లకు పోలీసుల భద్రత

కొడవళ్లు చేతపట్టిన ఆ గ్యాంగ్ మెడికల్ షాప్ సిబ్బందిపై దాడికి ముందు కామ్ గర్ నగర్ ప్రాంతంలోని కొన్ని వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత నాలుగు నెలల్లో పూణేతోపాటు రాష్ట్రంలోని పలు చోట్ల కొడవళ్ల వంటి కత్తులు చేతపట్టిన ఇలాంటి ముఠాల దాడులు అధికమయ్యాయి.

ఇలాంటి కేసులు వందకు పైగా నమోదు అయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కొడవళ్ల గ్యాంగ్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఈ ముఠాల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా జరిగిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.