PUBG : బుద్ధిగా చదువుకుంటారని స్మార్ట్ ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్

ఆన్ లైన్ క్లాసుల కోసం అని మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనిచ్చారా? పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేయండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు...

PUBG : బుద్ధిగా చదువుకుంటారని స్మార్ట్ ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్

Pubg

PUBG : కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ జనాలను ఏడిపించుకుని తింటోంది. వైరస్ వెలుగులోకి వచ్చి ఏడాదికి పైగా అవుతున్నా ఇంకా తిప్పలు తిప్పడం లేదు. కరోనా ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగాను జనాలను ఏడిపిస్తోంది. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ఆన్ లైన్ క్లాసులు తెరపైకి వచ్చాయి. ఈ ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎంతమంది పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారో తెలియదు కానీ, కొంతమంది పిల్లలు దారితప్పుతున్నారు. బుద్ధిగా చదువుకుంటారు కదా అని పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిస్తే.. కొందరు పిల్లలు చేస్తున్న పనులతో తల్లిదండ్రులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది. కొందరు పిల్లలు స్మార్ట్ ఫోన్లలో చూడకూడనివి చూసి చెడిపోతుంటే, మరికొందరు గేమ్స్ కి బానిసలు అవుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. జరగాల్సిన నష్టం జరిగాక తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.

తాజాగా కేరళ కోజికోడ్ లో జరిగిన ఓ ఘటన పిల్లల తల్లిదండ్రులకు మైండ్ బ్లాంక్ చేసింది. ఆన్ లైన్ క్లాసుల కోసం అని ఓ తల్లి తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వగా, వారు పబ్ జి గేమ్ కోసం ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశారు.

కరోనా కారణంగా ప్రస్తుతం స్కూల్స్ మూతపడ్డాయి. అంతా ఆన్ లైన్ క్లాసుల హవా నడుస్తోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వక తప్పడం లేదు. ఇదే విధంగా కోజికోడ్ లో ఓ తల్లి ఆన్ లైన్ క్లాసుల కోసం అని తన పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒకరు 9వ తరగతి, మరొకరు 10వ తరగతి చదువుతున్నారు. ఫోన్ ఇస్తే చక్కగా, బుద్ధిగా చదువుకుంటారని ఆశించింది.

కట్ చేస్తే.. ఆ పిల్లలు చదువుకోవడం మాటేమో కానీ, ఆన్ లైన్ గేమ్ పబ్ జీ కి బానిసలుగా మారారు. పబ్ జీ మొబైల్ అకౌంట్ అప్ గ్రేడ్, ఇన్ యాప్ కొనుగోళ్ల కోసం తల్లి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు కూడా చేశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి తనకు తెలియకుండానే లక్ష రూపాయలు కట్ అవ్వడంతో తల్లి షాక్ అయ్యింది. ఏం జరిగిందోనని కంగారు పడింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో విస్తుపోయే నిజం తెలిసింది. లక్ష రూపాయలు ఖర్చు చేసింది మరెవరో కాదు ఆమె పిల్లలే అని పోలీసులు తేల్చారు. పబ్ జీ గేమ్ లో నెక్ట్స్ లెవెల్స్ ఆడేందుకు పిల్లలు డబ్బు ఖర్చు చేసినట్టు పోలీసులు చెప్పారు.

పిల్లలకు తమ తల్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ డీటైల్స్ తెలుసు. దీంతో వారే లాగిన్ అయ్యి డబ్బు తగలేశారు. అయితే డబ్బు ఖర్చు చేసిన విషయాన్ని ఆ పిల్లలు తమ తల్లికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు. డబ్బులు పోయాయని తల్లి పోలీస్ కంప్లయింట్ ఇచ్చినప్పటికీ పిల్లలు నోరు మెదపలేదు. మొత్తంగా చక్కగా చదువుకుంటారని ఆశించి ఆ తల్లి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు కొనిస్తే.. వాళ్లేమో తల్లి జేబు గుల్ల చేశారు. ఈ ఘటన ఆన్ లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టింది. పిల్లలకు ఫోన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, వారు వాటిలో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులను నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోతప్పదని హెచ్చరిస్తున్నారు.