Telangana : నల్గొండ జిల్లాలో నరబలి టెన్షన్! హతుడి గుర్తింపు-లభ్యం కాని మొండెం

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం లో మొండెం నుండి వేరు చేసిన తల లభించడం నిన్న స్థానికంగా కలకలం

Telangana : నల్గొండ జిల్లాలో నరబలి టెన్షన్! హతుడి గుర్తింపు-లభ్యం కాని మొండెం

Nlg Narabali

Telangana :  నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ లోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం లో మొండెం నుండి వేరు చేసిన తల లభించడం నిన్న స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి మొండెం, తలను వేర్వేరు చేసి.. అమ్మవారి పాదాల వద్ద తల ను వదిలివెళ్లారు దుండగులు. ఈ ఘటన జిల్లావాసులను ఉలిక్కి పడేలా చేసింది. నిన్న సాయంత్రానికి పోలీసులు మృతుడి వివరాలను గుర్తించారు….కానీ అతని మొండెం  లభ్యం కాలేదు. మొండెం  కోసం గాలింపు కొనసాగుతోంది.

హైదరాబాద్-నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారికి ఆనుకొని ఉన్న శ్రీ మెట్టు మహంకాళి దేవాలయంలో రోజులాగే సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లిన పూజారికి అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. ఓ వ్యక్తిని హత్య చేసి ఆలయంలోని అమ్మవారి పాదాల వద్ద తల వదిలి వెళ్లారు దుండగులు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మ‌హంకాళి అమ్మ‌వారి కాళ్ల వ‌ద్ద త‌ల‌ను చూసి వెంటనే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు ఆలయ పూజారి. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ స‌హాయంతో ఆధారాలు సేక‌రించారు పోలీసులు. వేరే ప్రాంతంలో హ‌త్య చేసి ఇక్క‌డ త‌ల‌ను ప‌డేసి ఉంటార‌ని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు.

స్థానికంగా అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు, అధికారులకు మృతుడి తల ఫోటో నూ పోలీసులు పంపి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాయంత్రం వరకు ఎటువంటి ఫలితం లేకపోవడంతో హ‌త్య‌కు గురైన వ్య‌క్తి   ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి గా అనుమానించారు. మరణించిన వ్యక్తి వివరాలు, దుండగుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.

చింత‌ప‌ల్లి పోలీసులు కేసు  న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించి.. క్లూస్ టీంతో పాటు న‌ల్ల‌గొండ నుంచి డాగ్ స్వ్కాడ్ తీసుకొచ్చి ఆధారాల కోసం చుట్టు ప‌క్క‌ల వెతికారు. డాగ్ స్వ్కాడ్ ఘ‌ట‌నా స్థ‌లం నుంచి దాదాపు మూడు వంద‌ల మీట‌ర్ల దూరంలో ఉన్న గ్రామంలోని ఓ ఇంట్లోకి  వెళ్లి ఆగింది. దేవ‌రకొండ డీఎస్పీ ఆధ్వ‌ర్యంలో పోలీసులు మొండెం ప‌రిసర ప్రాంతాల్లో ఎక్క‌డ‌న్నా  ప‌డేశారా అన్న కోణంలో గాలింపు చేపట్టారు. మరోక బృందం మృతుడు ఎవ‌ర‌న్న‌ది క‌నుగొనే ప‌నిలో పడ్డారు.

స్థానికులు మాత్రం హ‌త్య‌కు గురైన వ్య‌క్తి స్థానికుడు కాద‌ని తెలిపారు. ఎవ‌రో ఇత‌ర ప్రాంతాల్లో హ‌త్య చేసి ఇక్కడ ప‌డేశార‌ని హైవే కావ‌డంతో పాటు నిర్మానుష్యంగా ఉండ‌టంతో త‌ల‌ను ఇక్క‌డ పెట్టి వెళ్లి ఉంటార‌ని వ్యాఖ్యానించారు. అయితే మృతుడు ఎవ‌రు అన్నది తెలిస్తే హ‌త్య‌కు గ‌ల కారణాలు తెలిసే అవ‌కాశం ఉందని పోలీసులు భావించారు.

వివాహేతర సంబంధం నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగిందా లేక ఆర్థిక‌ప‌ర‌మైన వివాదాలు కార‌ణ‌మా అనే కోణంలో విచారణ  చేసారు పోలీసులు. మ‌రోవైపు న‌ర‌బ‌లి లాంటి ఉదంతం ఏమ‌న్నా జ‌రిగి ఉండొచ్చా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో అగ‌ర్‌బ‌త్తిల‌తో పాటు పూజ‌కు సంబంధించిన వ‌స్తువులు ఉండ‌టంతో అనుమానాలు రేకెత్తించాయి.

Also Read : Jagityala : వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు-భారీ ఎత్తున నగదు, బంగారం స్వాధీనం

చివరికి పోలీసులు నిన్న రాత్రికి  మృతుడి వివరాలు సేకరించగలిగారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు (మం)శూన్యపహాడ్ కు చెందిన  రమావత్ యాజెందర్ గా గుర్తించారు.  అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చిన పోలీసులు వారిని కలిశారు. యాజేందర్ ఐదేళ్ల క్రితమే గ్రామం విడిచి వెళ్లినట్టు స్ధానికులు చెప్పారు. ?

మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆలయాల్లో తలదాచుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని ఓ ఆలయంలో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.  అంటే ఎవరో దుండగులు ఇబ్రహీంపట్నంలో హత్యచేసి ఇక్కడకు తీసుకువచ్చిపడేశారా ? ..మతిస్ధిమితం సరిగా లేని వ్యక్తిని ఎవరు హత్య చేసి ఉంటారు ? ….హత్య ఎక్కడ జరిగింది ? …లేదా నరబలి జరిగిందా ?.. అయితే యాజేందర్ మొండెం ఎక్కడ ఉంది ? వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొండెం కోసం గాలిస్తున్నారు.