Tension in Karnataka: భజరంగ్ దళ్ కార్యకర్త హత్య, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు
భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది.

Shimoga
Tension in Karnataka: హిజాబ్ వివాదంతో..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కర్ణాటక రాష్ట్రంలో..మరో ఘటన పెను వివాదానికి పునాది వేసింది. భజరంగ్ దళ్ కార్యకర్తను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని శివమొగా జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో శిమొగా జిల్లా సహా మరికొన్ని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తు, ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలనూ మూసివేయాలని ఆ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే శిమొగా జిల్లా సీగేహట్టిలోని భారతి కాలనీకి చెందిన హర్షా(23) అనే భజరంగ్ దళ్ కార్యకర్తను ఆదివారం రాత్రి కొందరు దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న హర్షాను స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షా మృతి చెందాడు.
Also read: Mother Language Day : మాతృభాషలను ముందు తరాలకు అందజేయడం మనందరి బాధ్యత
భజరంగ్ దళ్ కార్యకర్త హత్యతో సీగేహట్టి ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. స్థానిక భజరంగ్ నేతలు, ఇతర కార్యకర్తలు.. నిరసనలు చేపట్టారు. రోడ్డుపై వాహనాలను తగలబెట్టి, దుకాణాలను మూసివేశారు. ఘటనపై సమాచారం అందుకున్న శిమొగా పోలీసులు అప్రమత్తమయ్యారు. సీగేహట్టి ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరింపజేశారు. శిమొగా జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు పోలీసులు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేసి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
Also read: Kamareddy News: కామారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య
ఇక ఈ ఘటనపై కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. త్వరితగతిన నిందితులను పట్టుకుని కోర్టులో హాజరు పరచాలని హోమ్ మంత్రి ఆదేశించారు. మరో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్పందిస్తూ “ఒంటరిగా ఉన్న భజరంగ్ దళ్ కార్యకర్తపై.. దుండగులు దాడి చేసి అమానుషంగా హత్య చేసారని, వారిని వూరికే వదిలే ప్రసక్తే లేదని” అన్నారు. ఇక ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. హర్షా హత్య కలచివేసిందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని సీఎం బొమ్మై సూచించారు.