Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

గోదాములోని క్రింది భాగంలో విద్యుత్ బోర్డులు, ఫ్యూజ్ లు అమర్చిన చోట లభించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు.. విద్యుత్ బాక్స్ లో అమర్చిన ఫ్యూజ్ లలో ఒక ఫ్యూజ్ లేకపోవడం గమనించారు.

Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

Fire Accident

Bhoiguda Fire Accident: సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడలో మార్చి 23న చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాద ఘటనపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తుక్కుగోదాములో జరిగిన అగ్నిప్రమాద ఘటన తాలూకు కారణాలపై క్లూస్ టీం సహాయంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో అగ్నిప్రమాదం సంభవించిన తుక్కుగోదాములో.. ఎలక్ట్రానిక్ త్రీడీ స్కానర్ తో క్లూస్ టీం వివరాలు సేకరించింది. గోదాములోని క్రింది భాగంలో విద్యుత్ బోర్డులు, ఫ్యూజ్ లు అమర్చిన చోట లభించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు.. విద్యుత్ బాక్స్ లో అమర్చిన ఫ్యూజ్ లలో ఒక ఫ్యూజ్ లేకపోవడం గమనించారు. దీంతో ఇక్కడే నిప్పురవ్వలు చెలరేగి గోదాం అగ్నికి ఆహుతైనట్లు అధికారులు ప్రాధమికంగా తేల్చారు. మరింత దర్యాప్తు కోసం గోదాములోని విద్యుత్ బాక్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించారు.

Also Read:Chittoor Bus Accident : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ పెళ్లి బస్సు, 10మంది మృతి

కాగా ఈఘటనలో ఇప్పటికే గోదాము యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్, ఫైర్ సేఫ్టీ సహా ఐదు శాఖల అధికారులు ఈఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బోయిగూడలో మార్చి 23న తెల్లవారు జామున సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు వలస కూలీలు మృతి చెందారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదాములో చెలరేగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి..అక్కడే ఉన్న స్క్రాప్ తగలబడింది. అనంతరం గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోవడంతో వ్యాప్తి తీవ్రత అధికమైనట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దట్టంగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని, కిందకు దిగేందుకు ఇనుప మెట్లు ఉన్నా..మంటల తీవ్రతతో అవి వేడెక్కడంతో వారు కిందకు దిగలేకపోయి ఉంటారని అధికారులు భావించారు.

Also read:Hijab Row: కర్ణాటకలో కొత్త వివాదం.. ముదిరిన ఆలయాల్లో ముస్లిం వ్యాపారాల బహిష్కరణ