మారుతీరావు ఫోరెన్సిక్ నివేదిక : ఏ పాయిజన్ తీసుకున్నాడు..విస్రా శాంపిల్ సేకరణ

  • Published By: madhu ,Published On : March 9, 2020 / 07:21 AM IST
మారుతీరావు ఫోరెన్సిక్ నివేదిక : ఏ పాయిజన్ తీసుకున్నాడు..విస్రా శాంపిల్ సేకరణ

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన ఆత్మహత్యకు సంబంధించి ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్టులో పలు అంశాలు వెల్లడించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, పాయిజన్ గారెల్లో పెట్టుకుని తినడంతో మారుతీరావు శరీరం రంగు మారిందన్నారు.

విషం తీసుకోవడం వల్లే…మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరానికి రక్తప్రసరణ ఆగిపోవడంతో గుండె పోటు వచ్చిందని, బ్రెయిన్‌డెడ్ అయ్యారని ప్రాథమిక రిపోర్టులో డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మారుతీరావు విస్రా శాంపిల్‌ను ఫోరెన్సిక్ వైద్యులు సేకరించారు. విస్రా ఎనాలసిస్‌తో మారుతీరావు ఏ పాయిజన్ తీసుకున్నాడో తెలుస్తుందంటున్నారు వైద్యులు. (మారుతీరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత..అమృతా రావద్దు..ఆయన ఆత్మ శాంతించదు)

ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 10న ప్రణయ్‌ కేసులో సాక్షుల విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

మారుతీరావు మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గిరిజా క్షమించు.. అమృతా అమ్మ దగ్గరకు వెళ్లిపో అని అందులో రాసి ఉంది. అయితే క్లూస్‌టీం సభ్యులు గదిలో పురుగు మందు సీసా కోసం వెతికినా దొరకలేదు.

ప్రణయ్‌ హత్యకేసులో ఈనెల 10న సాక్షుల విచారణ ఉంది. ఈ కేసునూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారించాలని డిమాండ్లు ఊపందుకోవడంతో తనకు తప్పకుండా శిక్ష పడుతుందని భయపడిన మారుతీరావు ఆత్మహత్యకు సిద్ధపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే మిర్యాలగూడలోనే ఓ స్నేహితుడి దుకాణంలో పురుగు మందు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

Read More : మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు