Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు ….

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.

10TV Telugu News

Car Fire Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు. ఆయన స్వస్ధలం ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కేంద్రలోని శివాజీనగర్ కాగా…గత కొన్నేళ్లుగా హైదరాబాద్   కేపీహెచ్‌బీకాలనీలో కుటుంబంతో కాపురం ఉంటూ, ఓకార్పోరేట్ ఆస్పత్రిలో అర్థోపెడిక్ వైద్యుడిగా పని చేసేవాడు. ఆయనకు భార్య సుప్రజ, 9సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

ఇటీవలి కాలంలో  సుధీర్ వైద్య వృత్తిని వదిలేసి మైనింగ్ వ్యాపారంలోకి దిగినట్లు తెలుస్తోంది. శుభకార్యానికి హజరయ్యేందుకు శనివారం సాయంత్రం ఒంగోలుకు కారులో ఒంటరిగా బయలు దేరారు. రాత్రి గం.7-09 సమయంలో నానాక్‌రామ్ గూడ వద్ద ఓఆర్ఆర్ ఎక్కారు. రాత్రి గం.8-10 సమయంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు శంషాబాద్, పెద్ద గోల్కొండ 135 కిలోమీటర్‌ పాయింట్‌ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి.. సుధీర్‌ సజీవ దహనమయ్యారు.
Also Read : TTD Sarva Darshanam : సర్వదర్శనం టోకెన్ల సంఖ్య పెంచిన టీటీడీ

సుధీర్ నానాక్ రామ్ గూడ వద్ద రాత్రి గం.7-09 గంటలకు ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లోనమోదైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై 100 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే నానక్ రామ్ గూడ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న హమీదుల్లా నగర్ కు 20 నిమిషాల లోపే చేరుకోవచ్చ కానీ…సుధీర్ గంటకు పైగా ప్రయాణం చేసి గం.8-10 సమయంలో హమీదుల్లా నగర్ చేరుకున్నారు. అక్కడ కారులో మంటలు చెలరేగి సుధీర్ కారులోనే సజీవ దహనమయ్యారు.

ఎరుపు రంగు కారు ఆధారంగా ఓఆర్‌ఆర్‌పై ఎంట్రీ వద్ద తనిఖీ చేసిన శంషాబాద్‌ పోలీసులు.. కారు నంబర్‌ ఏపీ 27 సీ 0206గా గుర్తించారు. కారుపై ఉన్న ఈ-చలాన్‌కు లింక్‌ఉన్న ఫోన్‌ నంబర్‌ను గుర్తించారు. దాని నుంచి వెళ్లిన చివరి కాల్‌ ఆధారంగా చనిపోయింది డాక్టర్‌ సుధీర్‌గా నిర్ధారించుకున్నారు. కారు స్టీరింగ్‌ వద్ద వైర్లు తెగడం వల్లే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందని, ఏసీ వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని శంషాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. ఆపై డీజిల్‌ ట్యాంక్‌ పేలిందని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడంతో కారు డోర్లన్నీ బిగిసుకుపోయి, అందులోనే చిక్కుకుని సుధీర్‌ ప్రాణాలు వదిలినట్టు భావిస్తున్నారు.
Also Read : Drugs Seized : అఫ్ఘానిస్తాన్-టూ-విజయవాడ …రూ. 9 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్

కారు దగ్ధం కావటానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. కాగా… కారులో బయలు దేరిన సుధీర్ ఆఖరుసారి తన భార్యతో సెల్ ఫోన్ లోమాట్లాడినట్లు గుర్తించారు. “కారులో వైర్లను ఎలుకలు కొట్టేశాయి. అయినా పర్లేదు… క్షేమంగా వచ్చేస్తాలే” అని భార్యతో చివరి సారిగా మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు నానక్ రామ్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డపైకి ఎక్కిన సుధీర్ మార్గమధ్యలో ఎక్కడైనా ఆగారా….లేక కారు ఇంజన్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా….ఏదైనా కుట్ర ఉందా, అత్మహత్యా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరో వైపు టెక్నికల్ కోణంలో పరిశీలన చేస్తే….హోండా అమేజ్‌ కారులో స్టీరింగ్‌ వద్ద వైర్లు తెగినా, ఇతర సమస్యలు వచ్చినా కారు డోర్లు బిగిసుకుపోతాయని పలువురు మెకానిక్‌లు  అభిప్రాయం వెలిబుచ్చారు.   అధికారిక సమాచారం కోసం శంషాబాద్‌ పోలీసులు.. ఆర్టీఏ అధికారులు, హోండా సంస్థ ప్రతినిధులకు లేఖలు రాయనున్నట్టు సమాచారం. అగ్నిమాపకశాఖ నివేదిక వచ్చాక ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కారులో మంటలు, పొగలు వస్తున్నట్టు గమనించినా, కాలిన వాసన వచ్చినా అప్రమత్తం కావాలని పోలీసులు చెప్తున్నారు. డోర్‌లు బిగిసుకుపోతే సీట్‌ బెల్టు బకెల్‌ సాయంతో అద్దాలను పగుల గొట్టాలని సూచిస్తున్నారు.

10TV Telugu News