Telangana : నల్గొండ జిల్లా నరబలి ? మృతుడికి మతిస్ధిమితం లేదు

నల్గొండ జిల్లా చింతపల్లి  మండలం గొల్లపల్లిలో నిన్న తల లభించిన కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ క

Telangana : నల్గొండ జిల్లా నరబలి ? మృతుడికి మతిస్ధిమితం లేదు

Nalgonda District

Telangana :  నల్గొండ జిల్లా చింతపల్లి  మండలం గొల్లపల్లిలో నిన్న తల లభించిన కేసులో మృతుడిని పోలీసులు గుర్తించారు. మృతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ కు చెందిన రమావత్ శంకర్ నాయక్ కుమారుడు రమావత్ యజెందర్ గా గుర్తించారు.  నిందితులు యాజేందర్ తల, మొండెం వేరుచేసి తలను మహంకాళి అమ్మవారి కాళ్ల దగ్గర వదిలి వెళ్లారు. కేసు విచారణలో భాగంగా చింతపల్లి పోలీసులు యాజేందర్ ఫోటోను అన్ని పోలీసు స్టేషన్లకు పంపించారు. యజెందర్ ను గుర్తించిన అతని తల్లితండ్రులు  రాత్రికి దేవరకొండ చేరుకున్నారు.

అతని తల్లి తండ్రులు చెప్పిన వివరాలుప్రకారం…యజెందర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో అతడ్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చి చికిత్స ఇప్పించారు. అయినా తగ్గకపోవడంతో అతనిపై కుటుంబ సభ్యులు ఆశ వదులుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత నుండి యజెందర్ గ్రామానికి రాలేదని తెలిపారు. గత ఐదేళ్లుగా దేవాలయాల్లో తలదాచుకుంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

రెండు నెలల నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజిల్ లోని ఓ ఆలయంలో ఉంటున్నట్టు తల్లి తండ్రులకు సమాచారం అందింది. జరిగిన ఘటనను చూసిన తల్లి తండ్రులు నరబలి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పోలీసులకు నల్గోండ జిల్లా పోలీసులు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం నుండి చింతపల్లి వరకు అన్ని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

యజెందర్ ఇబ్రహీంపట్నం నుంచి ఎప్పుడు బయలు దేరాడు ? ఎవరెవరిని కలిశాడు ? ఎవరెవరు కలిశారు ? ఎక్కడికెక్కడకు వెళ్ళాడు ? అనే వివరాల కోసం  పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కోసం 8 బృందాలు ఏర్పాటు చేసారు.

Also Read : Telangana : నల్గొండ జిల్లాలో నరబలి టెన్షన్! హతుడి గుర్తింపు-లభ్యం కాని మొండెం

మొదట వివాహేతర సంబంధాల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావించిన పోలీసులు అతడి తల్లి తండ్రులు ఇచ్చిన సమాచారం….హతుడి పరిస్థితి తెలిశాక నరబలి కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసారు.  తుర్కయాంజిల్-దేవరకొండ సమీపంలోని గుట్టల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు, నరబలులు జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.