12 రోజుల తర్వాత లండన్ బీచ్ లో : బీజేపీ జిల్లా అధ్యక్షుడి కొడుకు మృతదేహం

  • Published By: veegamteam ,Published On : September 3, 2019 / 04:13 AM IST
12 రోజుల తర్వాత లండన్ బీచ్ లో : బీజేపీ జిల్లా అధ్యక్షుడి కొడుకు మృతదేహం

12 రోజుల క్రితం లండన్‌లో మిస్సైన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష మిస్సింగ్ మిస్టరీ విషాందాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన శ్రీహర్ష… బీచ్‌లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి ఉదయ్ ప్రతాప్ కుమార్ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కుమారుడి మరణ వార్త విని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆగస్ట్ 23న శ్రీహర్ష అదృశ్యమయ్యాడు.

లండన్‌లోని బీచ్‌ దగ్గర శ్రీహర్ష సెల్‌ఫోన్‌, బ్యాగ్, ల్యాప్‌టాప్‌ ను పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా శ్రీహర్ష అదృశ్యమైనట్టు నిర్ధారించుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ రోజు నుంచి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకు ఆచూకీ కోసం ఆందోళన చెందారు. శ్రీహర్ష ఆచూకీ కోసం లండన్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సాయంతో లండన్ అధికారులతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో పాటు, లండన్‌లో ఉన్న తెలుగు వారితో మాట్లాడారు. శ్రీహర్ష ఆచూకీ కనుగొనేందుకు సాయం కోరారు. పీజీ చేసేందుకు కొద్దికాలం క్రితం శ్రీహర్ష లండన్ వెళ్లాడు. ఆగస్టు 23న మధ్యాహ్నం నుంచి శ్రీహర్ష కనబడటం లేదు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. శ్రీహర్ష మిస్సింగ్ వెనుక మిస్టరీ తేల్చే పనిలో ఉన్నారు. అసలేం జరిగింది అని ఆరా తీస్తున్నారు. ఇది హత్య, ఆత్మహత్య, లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీహర్ష ఫ్రెండ్స్ ని, కాలేజీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.