భర్త పేరుతో రూ.20లక్షలు బీమా చేయించి..హత్య చేయించిన భార్య

  • Published By: nagamani ,Published On : June 23, 2020 / 07:01 AM IST
భర్త పేరుతో రూ.20లక్షలు బీమా చేయించి..హత్య చేయించిన భార్య

భర్త ప్రవర్తనతో విసిగిపోయింది ఓ భార్య. మద్యానికి బానిసై దొరికిన చోటల్లా అప్పులు చేసి ఇల్లు గుల్ల చేసినా ఓర్చుకుంది. తాగి వచ్చి తనను ఎన్నిరకాలుగా హింసించినా భరించింది. కానీ కన్నకూతురిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ..వెకిలిచేష్టలు చేస్తున్న భర్తపై పట్టరాని ఆగ్రహంవచ్చింది. కానీ సహించింది. ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. కానీ కూతురిపై వికారపుచేష్టలు మానని భర్తను ఇలా వదిలేస్తే తన కూతురి బ్రతుకు నాశనం చేస్తాడనిభయపడింది. దీంతో వేరే దారిలేక..అతన్ని అంతమొందించాలనుకుంది.

కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచింది. దీనికో ప్లాన్ వేసింది. భర్త పేరుమీద రూ. 20 లక్షలకు బీమా చేయించి ఆ తర్వాత భర్తను అంతమెందించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో పెను సంచలన కలిగించింది. 

పోలీసుల కథనం ప్రకారం..వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం హత్యా తండాకు చెందిన బాదావత్ వీరన్న.. భార్య యాకమ్మతో కలిసి పున్నేలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ తో స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో వీరన్న ఖాళీ మద్యం సీసాలు సేకరించి అమ్ముతుండేవాడు.

ఈ క్రమంలో గతంలో మద్యం బాగా తాగే అలవాటున్న వీరన్న మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో గతంలో ఎన్నో రకాలుగా భార్యను..బిడ్డను వేధించేవాడు. ఇప్పుడు మరింతగా మద్యం తాగటంతో ఆ మైకంలో వీరన్న భార్య యాకమ్మతోపాటు కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో భార్య ఎంతగానో చెప్పిచూసింది. కాళ్లా వేళ్లా పడి వేడుకుంది. భర్త ఇంటికి వస్తే చాలు యాకమ్మ..కూతురు హడలిపోయేవారు. భర్తకు భయపడిన యాకమ్మ కూతుర్ని దాచేసేది. కానీ నీ కూతుర్ని ఎక్కడికి పంపావే అంటూ భార్యను తీవ్రంగా కొట్టేవాడు. 

భర్త  ప్రవర్తనతో విసిగిపోయిన భార్యయాకమ్మ వీరన్నను చంపేయాలని నిర్ణయించింది. తరువాత ఎలా బతకాలి అని అనుకున్న ఆమె ముందుగా గ్రామంలోని గ్రామీణ బ్యాంకులో రూ. 20 లక్షలకు బీమా చేయించింది. ఆ తరువాత చెన్నారావుపేటకు చెందిన తన సోదరుడు భూక్యా  బిచ్చాల  అతని భార్య బూక్యా బుజ్జి సహకారంతో హత్య చేయించింది.

ప్లాన్ ప్రకారం..జూన్ 9న మద్యం సీసాల సేకరణకు వీరన్న నెక్కొండ వెళ్లాడు. అది తెలుసుకున్న యాకమ్మ తన సోదరుడికి సమాచారం అందించింది. దీంతో ఆ రోజు సాయంత్రం నెక్కొండలో వీరన్నను కలిసిన బిచ్చాల తన బైక్‌పై ఎక్కించుకుని హత్యా తండాకు బయలుదేరాడు. దారి మధ్యలో బావకు బాగా మద్యం తాగించి రాత్రి 11:45 గంటల సమయంలో పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే యాకమ్మ, బుజ్జి ఉన్నారు.

అందరూ కలిసి వీరన్న మెడకు తాడు కట్టి ఉరి తీసేశారు. కానీ వీరన్నది గట్టి ప్రాణం. ఇంకా బతికేఉన్నాడని గమనించటంతో..పెద్ద బండరాయి తెచ్చి వీరన్న ముఖంపై పదే పదే కొట్టి చంపేశారు. తరువాత చనిపోయాడని నిర్ధారించికుని శవాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి చేతులు దులుపుకుని..ఏమీ ఎరగనట్టు ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. 

ఆ తర్వాతి రోజు నుంచి తన భర్తను ఎవరో హత్య చేశారంటూ నటించడం మొదలుపెట్టింది యాకమ్మ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పార్వతగిరి ఇన్స్పెక్టర్ పులాలా కిషన్  సీసీటీవీల ఆధారంగా హత్య కేసును ఛేదించారు. ఈహత్యలో భార్య యాకమ్మతోపాటు కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తించారు.  నిందితులు యాకమ్మ, బిచ్చా, బుజ్జిలను అరెస్ట్ చేశారు.ఆ తరువాత వారిని విచారించగా..నేరాన్ని అంగీకరించారు.