Gun Misfire : సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో కలకలం.. డీఎస్పీ మృతి, అసలేం జరిగింది?

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Gun Misfire : సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌లో కలకలం.. డీఎస్పీ మృతి, అసలేం జరిగింది?

Updated On : April 24, 2024 / 5:41 PM IST

Gun Misfire : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంప్ లో గన్ మిస్ ఫైర్ అయ్యి సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందారు. సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంపులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శేషగిరి.. గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ ఆయన ఛాతిలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయనను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

కాగా, ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్ ఫైర్ జరిగిందా? లేక ఆత్మహత్యనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడ్డారా?
గతంలోనూ అక్కడ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. క్యాంపులో గన్ మిస్ ఫైర్ కావడం, ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో గన్ మిస్ ఫైర్ అయ్యిందా? లేక డీఎస్పీ శేషగిరి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాఫ్తు చేపట్టారు. డీఎస్పీ మృతికి కారణాలు ఏంటి అన్నదానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.

పూసుగుప్ప క్యాంప్ అంటేనే హడల్..!
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు అధికారులు. విధి నిర్వహణలో ఉన్న ఇబ్బందులతో డీఎస్పీ ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక అధికారుల వేధింపులు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. క్యాంప్ లో జరుగుతున్న వరుస ఘటనలు సిబ్బందిని, అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ క్యాంప్ అంటేనే.. అంతా హడలిపోతున్నారు. పూసుగుప్ప క్యాంప్ అంటేనే బలవన్మరణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పుకుంటున్నారు.

 

Also Read : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్