ప్రాక్టికల్స్‌ లేకుండానే ఫెయిల్ : ఒకేషనల్‌ విద్యార్థులకూ అన్యాయమే

10TV Telugu News

తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జనరల్ గ్రూప్ విద్యార్థులనే కాదు ఒకేషననల్ విద్యార్థులకూ ఇంటర్ బోర్డు అధికారులు అన్యాయం చేశారు. వారి జీవితాలతోనూ చెలగాటమాడారు.  60మంది ఒకేషనల్‌ కోర్సు విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించకుండానే హాజరవలేదంటూ ఫలితాల్లో ఫెయిలైనట్లుగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఆందోళనలో పడిపోయారు. తమకు న్యాయం చెయ్యాలని, ప్రత్యేకంగా ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని కోరుతున్నారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో అప్తాల్మిక్‌ టెక్నీషియన్‌(ఓటీ) ఒకటి. ఈ కోర్సు చేస్తే ఆస్పత్రుల్లో కంటి పరీక్షల నిర్వహణ టెక్నీషియన్‌గా ఉపాధి పొందవచ్చు. ఓటీ కోర్సును రాష్ట్రంలో కేవలం రెండు కాలేజీలే అందిస్తున్నాయి. ఇలాంటి డిమాండ్‌ కలిగిన కోర్సులను ఇంటర్‌ బోర్డు అధికారులు ఏకపక్షంగా ఎత్తివేస్తున్నారు. కేవలం కార్పొరేట్‌ కాలేజీల ప్రయోజనాల కోసమే ఇలాంటి వృత్తి విద్యా కోర్సులను ఎత్తివేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
కొన్ని ఒకేషనల్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించగా.. 2017-18లో ఓటీ కోర్సును కొనసాగించాలని ఆదేశించింది. దీంతో విద్యార్థుల అడ్మిషన్లకు అనుమతించారు. 2018-19లోనూ పలు వృత్తి విద్యా కోర్సులను  ఎత్తివేశారు. అందులో ఓటీ కోర్సు కూడా ఉంది. మళ్లీ కాలేజీలు కోర్టుకెళ్లగా.. పునరుద్ధరించాలని ఆదేశించింది. కోర్సును పునరుద్ధరించిన అధికారులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతించలేదు. దీంతో ఆ కోర్సులో  చేరిన విద్యార్థులే హైకోర్టుకు వెళ్లారు. 2019 జనవరి 23న హైకోర్టు తీవ్రంగా మందలించడంతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆన్‌లైన్‌లో అనుమతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల నుంచి ఓటీ కోర్సుకు పరీక్ష  ఫీజు తీసుకున్న బోర్డు అధికారులు.. వారికి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించలేదు. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు నిర్వహించారు. కానీ, ఓటీ కోర్సు చేసే విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయలేదు.
 
హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ.. బోర్డు అధికారులు వాటిని బేఖాతరు చేశారు. విద్యార్థులు మళ్లీ కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌ టికెట్లు జారీ చేశారు. ఆ పరీక్షలు ముగిసిన  తర్వాత తమకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారని విద్యార్థులు భావించగా, అలాంటిదేమీ జరగలేదు. కానీ, ఇంటర్‌ ఫలితాలతో పాటు ఓటీ కోర్సు చేసిన 60మంది విద్యార్థుల ఫలితాలూ వచ్చాయి. రాత పరీక్షలో అంతా పాస్ అయ్యారు. ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేదని చెబుతూ ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. తమకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించకుండా ఆబ్సెంట్‌ అయినట్లు ఎలా ప్రకటిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు.