ప్రయివేటు కు ధీటుగా ప్రభుత్వ గురుకులాలు 

  • Published By: chvmurthy ,Published On : May 16, 2019 / 03:38 PM IST
ప్రయివేటు కు ధీటుగా ప్రభుత్వ గురుకులాలు 

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా ఉంది. చదువుల్లోనే కాదు ఎక్స్ ట్రా కరిక్యూలర్ ఆక్టివిటీస్‌లో కూడా ముందంజలో ఉంటూ.. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాయి.

ఇటు అకడమిక్స్‌లో రాణిస్తూ.. అటు స్పోర్ట్స్ వంటి ఇతర ఆక్టివిటీస్‌లో ముందుంటూ.. తెలంగాణా రాష్ట్ర ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్స్‌. స్వరాష్ట్ర సాధనకు ముందు సోషల్ వెల్ఫేర్ విద్యార్థులను ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో సీటు కోసం క్యూ కడుతున్నారు. లిమిటెడ్ సీట్లతో క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని అందించడంలో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌ గ్రాండ్‌ సక్సెస్ సాధిస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గొడుగు కింద ఉన్న ఈ గురుకులాల్ని తెలంగాణ ఏర్పడ్డాక ఐదు గురుకులాలుగా విభజించింది సర్కార్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ ఇలా ఐదు సొసైటీలుగా ఏర్పడి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేట్‌ స్కూల్స్‌తో పోటీ పడుతున్నాయి. గతేడాది సీఎం కేసీఆర్ మరికొన్ని గురుకులాలను మంజూరు చేయడంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నామని అంటున్నారు అధికారులు. పేరెంట్స్‌లో గురుకులాలంటే ఇంత క్రేజ్ పెరగడానికి కారణం ఇక్కడ విద్యా విధానమేనంటున్నారు అధికారులు. ఇక్కడ విద్యార్థులను ముందుకు నడిపించేందుకు టీచర్లు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటారు.

ఇక ఫలితాల్లో ఇటు ప్రైవేటు కన్నా..అటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందరికన్నా ముందంజలో బీసీ వెల్ఫేరే ఉంటుందంటున్నారు బీసీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ మల్లయ్య బట్టు. తామెప్పుడు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చినా ఒక్క సీటు కోసం కనీసం ఐదుగురు విద్యార్థుల పోటీ పడుతుంటారని అంటున్నారాయన. ఇంత క్రేజ్ రావడానికి కేవలం ఇక్కడి నాణ్యమైన విద్యావిధానమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం142 బీసీ వెల్ఫేర్ పాఠశాలలుండగా.. 19 ఇంటర్ కాలేజీలున్నాయి. మరో డిగ్రీ కాలేజీ కూడా ఉంది. వీటిల్లో 50 వేల మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరానికి మరో 119 విద్యాసంస్థలు రాబోతున్నాయి.. అంతేకాకుండా ఈ అకడమిక్ ఇయర్‌కి మరో 42 వేల మంది విద్యార్థులు పెరగబోతున్నారని చెప్పారు. 

మరోవైపు సాధారణంగా ముస్లీం మైనార్టీ పిల్లల్ని బయటకు పంపి చదివించడమే గగనం. ఇటువంటి తరుణంలో మైనార్టీ రెసిడెన్షియల్స్‌లో చదివించే విధంగా అవగాహన కల్పించి ప్రస్తుతం మైనార్టీ స్కూల్స్‌ను ఎంతో విజయవంతంగా నడుపుతున్నామంటున్నారు మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీ షఫీఉల్లా. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 60 వేల మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ సంఖ్య ఈ విద్యాసంవత్సరానికి 90 వేలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 204 స్కూల్స్‌లో లక్షా 30 వేల మందికి సరిపోయే సదుపాయాలున్నాయని అంటున్నారు ఆ విద్యాసంస్థల సెక్రటరీ. రాబోయే కాలంలో మరిన్ని మైనార్టీ గురుకులాలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేస్తామని చెప్పారు. 

ఇదిలావుండగా రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ సొసైటీలున్నాయి. వీటిలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మొత్తం 238 ఎస్సీ రెసిడెన్షియల్‌ స్కూల్స్, 30 డిగ్రీ కాలేజీలున్నాయి. 147 ఎస్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్,  22 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడి నుంచి ఎక్కువగా ఎక్స్‌ట్రా కరిక్యూలర్ ఆక్టివిటీస్‌లో పాల్గొంటూ ఉంటారు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన పూర్ణ, ఆనంద్‌లు కూడా ఈ గురుకుల విద్యార్థులే. 

మొత్తంగా ప్రభుత్వ బడులంటే లేని క్రేజ్.. గురుకులాలకు రావడానికి ఇక్కడి విద్యావిధానం, క్రమశిక్షణే కారణమని అంటున్నారు విద్యావేత్తలు. ఫలితాలు కూడా ఇందుకు తగ్గట్టుగానే వస్తుండడంతో.. ప్రభుత్వం కూడా మరిన్ని గురుకులాలను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతోంది.