National Education Policy 2020 : చదువు మధ్యలో మానేసినా, మళ్లీ చేరి చదువుకోవచ్చు

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఒకసారి చేరితే ఆ కోర్సు పూర్తయ్యేవరకు చదువుకోవాలన్న నిబంధనకు ఇక కాలం చెల్లింది.

National Education Policy 2020 : చదువు మధ్యలో మానేసినా, మళ్లీ చేరి చదువుకోవచ్చు

National Education Policy

National Education Policy 2020 : అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఒకసారి చేరితే ఆ కోర్సు పూర్తయ్యేవరకు చదువుకోవాలన్న నిబంధనకు ఇక కాలం చెల్లింది. చివరి సంవత్సరంలో చదువు మానేసినా… తప్పినా మూడేళ్ల చదువు వృధా అనే భావనకు చెక్ పెట్టినట్లే. అంతేకాదు ఒక కాలేజీలో చేరి చదువు మొదలెట్టి… మూడేళ్ళు అక్కడే చదవాలన్న రూల్ ను బ్రేక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్ధులు ఎప్పుడైనా చదువు మానేసి వెళ్ళటం… మళ్లీ చదవాలనుకుంటే ఎప్పుడైనా చేరేలా ఈ నూతన విద్యావిధానంలో అవకాశం కల్పించారు.

కేంద్రం నూతనంగా తీసుకు వచ్చిన జాతీయ విద్యావిధానంలో ఈ సౌలభ్యాలను కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో మల్టీపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ కు అవకాశం కల్పించిన నేపధ్యంలో పధకం అమలుకు యుజిసి మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని అన్ని యూనివర్సిటీలు వర్తింప చేసుకుని అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మూడు, నాలుగేళ్ల డిగ్రీ అందుబాటులోకి రానున్నది. కాగా ఈ అంశంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఈ ఏడాది నూత విధానం అమలు లోకి  రాదని నిపుణులు చెపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మొదట ఈ నూతన విద్యావిధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

డిగ్రీలో చేరిన విద్యార్థి చదువు వదిలేసి వెళ్లాలంటే ఏడాది తర్వాత అవకాశం ఉంటుంది. అంటే ఒక సెమిస్టర్‌ తర్వాత వెళ్లడానికి వీల్లేదు. ఒక కళాశాల నుంచి మరో దానికి 3, 5, 7 సెమిస్టర్లలోనే మారాలి. చదువు మానుకొని వెళ్లాలంటే 2, 4, 6, 8 సెమిస్టర్లు పూర్తయ్యే వరకు వేచి చూడాలి. ఏడాది పూర్తయిన తర్వాత వెళితే సర్టిఫికెట్‌, రెండేళ్లకు డిప్లొమా, మూడేళ్లకు జనరల్‌ డిగ్రీ, నాలుగేళ్లకు ఆనర్స్‌ లేదా రీసెర్చ్‌ డిగ్రీ పట్టా ఇస్తారు.

మూడేళ్ల డిగ్రీలో చేరిన వారు ఒకటి, రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత చదువు మానేయవచ్చు. అదే రెండేళ్ల పీజీలో చేరిన వారు ప్రథమ సంవత్సరం పూర్తయిన తర్వాత బయటకు వెళ్లొచ్చు. డిగ్రీని మూడేళ్ల సాధారణ కోర్సు మాదిరిగా కాకుండా నాలుగేళ్ల ఆనర్స్‌ లేదా రీసెర్చ్‌ కోర్సుగా అందించవచ్చు. నాలుగో ఏడాది పూర్తిగా పరిశోధనా ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది.

మూడేళ్ల డిగ్రీ చదివిన వారు రెండేళ్ల పీజీ చేయాలి. అదే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక సంవత్సరం పీజీ చదువుతారు. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీలో చేరితే మూడేళ్ల తర్వాత వారికి ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఇస్తారు. ఆ కోర్సును అక్కడే చదవవచ్చు. లేదంటే మరో సంస్థలో పీజీ చేయవచ్చు. మొత్తం కోర్సులో 40శాతం క్రెడిట్లను స్వయం పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పొందొచ్చు. వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణ విద్యతో ఒకేషనల్‌ విద్యను మిళితం చేస్తారు. అంటే ఏదో ఒక వృత్తి విద్యను విద్యార్థులు నేర్చుకోవడం తప్పని సరి చేసింది కేంద్ర ప్రభుత్వం.