హమ్మయ్య : తెలంగాణలో నో కరోనా వైరస్

  • Published By: madhu ,Published On : February 10, 2020 / 06:34 PM IST
హమ్మయ్య : తెలంగాణలో నో కరోనా వైరస్

తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది వైద్యారోగ్య శాఖ. కరోనా అనుమానితుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రిపోర్టులు రాలేదని స్పష్టం చేసింది. వైరస్‌ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. అటు విశాఖలో కూడా కేంద్ర బృందం పర్యటిస్తోంది.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతోంది. కరోనా ను కట్టడి చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టాయి. తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించడంతో.. అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు, కరోనా వైరస్‌పై ఎవరు అసత్యాలు ప్రచారం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ. గాంధీ ఆస్పత్రిలో చైనా దేశస్తులకు కరోనా వైరస్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రిపోర్ట్ వచ్చిందంటూ వారం రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. 

గాంధీలో చేరిన ఇద్దరు చైనా వారికి కరోసా సోకిందంటూ ప్రచారం చేసిన వైద్యుడిపై వేటు వేశారు అధికారులు. గాంధీలో CMOగా చేస్తున్న వైద్యుడిని గాంధీ వర్గాల ఫిర్యాదుతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌లో సరెండర్ చేశారు. అయితే ఈ తతంగం వెనక కరోనా ఒక్క విషయమే కాదని ఏడాది నుంచి అడ్మినిస్ట్రేషన్‌పరంగా అనేక ఇబ్బందులు పెడుతున్నందునే ఆ వైద్యున్ని సరెండర్‌ చేశామని గాంధీ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్ శ్రవణ్ చెప్పారు. కరోనాకి సంబంధించిన సమాచారం కేవలం నోడల్ అధికారి మాత్రమే మీడియాకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. 

తెలంగాణలో ఇప్పటి వరకు 74 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేశారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 42 మందిని పరీక్షించారు. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ లేదని ప్రకటన చేశారు మంత్రి ఈటల రాజేందర్. 

కేంద్ర కరోనా వైద్య బృందం విశాఖపట్నం చేరుకుంది. ఈ వైద్య బృందం ఎయిర్‌పోర్ట్‌తో పాటు నగరంలో ఆస్పత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాలను పర్యటిస్తారు. కరోనా వైరస్ ఎవరికైనా సోకితే.. దానికి తగ్గ వైద్యం అందించడానికి సదుపాయాలు ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి ముగ్గురు డాక్టర్ల కేంద్ర బృందం విశాఖలో పర్యటిస్తోంది.