బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానికులు

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 04:33 PM IST
బోరబండలో మళ్లీ భూ ప్రకంపనలు.. భయాందోళనలో స్థానికులు

Earth tremors in Borabanda : హైదరాబాద్‌ నగరంలో మళ్లీ భూమి కంపించింది. బోరబండ ప్రాంతంలో మళ్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలతో భూమి కంపించినట్లు
అక్కడి స్థానికులు చెబుతున్నారు. బోరబండలో రెండు రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే మరింత పెద్ద శబ్దాలు వచ్చాయని తెలిపారు. ప్రతి 5 నిమిషాలకు
ఓసారి శబ్దాలు వస్తున్నట్లు వెల్లడించారు.

ఈ భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 0.8 నమోదయినట్లు NGRI (National Geophysical Research Institute) అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా వరుసగా భూమి పొరల నుంచి శబ్దాలు వచ్చాయి. దీంతో బోరబండ ప్రజల్లో ఆందోళనతో భయ భ్రాంతులకు గురవుతున్నారు.

ఇదివరకే వచ్చిన శబ్దాలతో NGRI అధికారులు బోరబండలోని పలు కాలనీల్లో పర్యటించారు. భూకంప తీవ్రతను కొలిచేందుకు మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్
పరికరాలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 2న వచ్చిన ప్రకంపనల 1.4 తీవ్రత నమోదైంది. ఈ రోజు మాత్రం 0.8 తీవ్రత నమోదయింది. తీవ్రత చాలా
తక్కువగానే నమోదైంది.

ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని NGRI అధికారులు వెల్లడించారు. బోరబండ ప్రాంతం ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉంది. దీంతో భూమి లోపలి పొరల్లో ఏర్పడే సర్దుబాట్ల కారణంగానే శబ్దాలు వస్తున్నట్లు తెలిపారు.

2017 అక్టోబర్‌లోనూ ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అయితే 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు కూడా అక్టోబర్‌లోనే భూమి కంపించిందన్నారు.