రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 08:20 AM IST
రైతులకు మంచికాలం : తెలంగాణలో డ్రోన్‌ సిటీ

తెలంగాణలో డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్‌ తదితర వ్యవహారాలను డ్రోన్‌ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పాలసీని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఫిలింసిటీ, ఫార్మాసిటీ లాంటి పేర్లను ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో మరో పేరును వినబోతున్నాం. అదే డ్రోన్‌ సిటీ.

డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో డ్రోన్‌ల సహాయంతో రైతుల ఇబ్బందులను తొలగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  అంతేకాదు.. మైనింగ్‌ రంగంలో వెలుగు చూస్తున్న అక్రమాలకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. డ్రోన్‌ కెమెరాలతో ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి… లీజుదారులు ప్రభుత్వానికి చేకూర్చే నష్టాలకు చెక్‌ పెట్టాలని సర్కార్‌ భావిస్తోంది.
Also Read : సూపర్ సక్సెస్ : డ్రోన్ ద్వారా కిడ్నీ డెలివరీ

డ్రోన్‌ సిటీకి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ నుంచి ఇందుకు సంబంధించి అనుమతులు కూడా అందాయి. డ్రోన్ల నిర్వహణకు అర్హతలున్న పైలెట్ల కొరత ఉండడంతో.. ఈ సమస్యను అధిగమించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి చూపిస్తే వారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరపున ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ముందుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

డ్రోన్‌ కెమెరాలు వాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు పొందిన తర్వాత.. స్థానికంగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త సంస్థలు ఆసక్తి కనబరిస్తే సింగిల్‌ విండో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసి.. అధికారికంగా అన్ని పనులు పూర్తి చేయాలన్న యోచనలో ప్రభుత్వముంది. డ్రోన్ల వినియోగంపై నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

రైతులు పంట కోసం వినియోగించే క్రిమిసంహారక మందులను నేరుగా వాడితే రైతులు ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. డ్రోన్ల సహాయంతో మందులు వినియోగిస్తే.. తక్కువ సమయంతోపాటు అత్యంత సురక్షితంగా పంటలను కాపాడుకోవడం సాధ్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫెస్టిసైడ్స్‌ వాడడం కూడా కలిసి వస్తోందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక మైనింగ్‌ విషయానికి వస్తే.. లీజు పొందిన సంస్థలు తమకు కేటాయించిన భూమికంటే అధికంగా తవ్వకాలు జరుపుతున్నాయి. ఇది మైనింగ్‌ శాఖకు తలనొప్పిగా మారింది. డ్రోన్ల సహాయంతో ఇలాంటి అక్రమాలను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేసిన రాష్ట్రంగా గుర్తింపు పొందుతుంది.
Also Read : స్టోరీ ATMలు ఇవి : బటన్ నొక్కితే చాలు.. నచ్చిన కథ వచ్చేస్తోంది