ప్రాణం పోతే రాదు : పుట్ బోర్డ్ ప్రయాణీకులకు పోలీసుల వార్నింగ్ 

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 07:05 AM IST
ప్రాణం పోతే రాదు : పుట్ బోర్డ్ ప్రయాణీకులకు పోలీసుల వార్నింగ్ 

హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే యువకులు బస్సులోపల ఖాళీగా ఉన్నా సరే ఫుట్ బోర్డులపైనే నిల్చుంటారు. అదొక స్టైల్ అనుకుంటారు. డ్రైవర్లు, కండక్టర్లు ఎంతగా చెప్పినా వినరు. ఇటువంటి సమయంలో  పలు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఈ క్రమంలో ఫుట్ బోర్డ్ ప్రయాణీకులపై రాజకొండ పోలీసులు దృష్టి పెట్టారు. ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీపట్నం వెళ్లే విద్యార్ధులు ఎక్కువగా ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో..ఎల్బీనగర్ లో కమిషన్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎల్‌బి నగర్ రూట్లో ఆర్‌టిసి బస్సు ఫుట్ బోర్డ్‌లో ప్రయాణిస్తున్న యువకులకు రాచకొండ కమిషనర్ మహేష్ ఎం. భగవత్ కౌన్సెలింగ్ ఇచ్చారు. యువలకు క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వార్నింగ్ కూడా ఇచ్చారు.  తగిన జాగ్రత్తలు చెప్పి హెచ్చరించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..బస్సులో ఖాళీగా ఉన్నాసరే యువకులు ఫుట్ బోర్డులపై ప్రయాణించటం సర్వసాధారనంగా మారిపోయిందనీ…మెట్లపై నిలబడి ప్రయాణించటం..ఆగి ఉన్న బస్సును ఎక్కటం మానివేసి..బస్ మూవ్ అయ్యాక రన్నింగ్ లో ఎక్కుతూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు యువత వెర్రి చేష్టలు మానుకోవాలని..ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు. జాగ్రత్తగా వెళ్లి చదువుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కాబట్టి ఫుట్ బోర్డ్ ప్రయాణం మంచిది కాదంటూ విద్యార్ధులకు సూచించారు.  
కాగా కొన్ని రోజుల క్రితం ఇబ్రహీపట్నం సమీపంలో ఆర్‌టిసి బస్సులో నుంచి ఓ విద్యార్థిని పడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అనతరం ఈ రూట్ లో బస్సులు  మరిన్ని నడపాలను డిమాండ్ చేస్తూ…పలువురు విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  ఈ క్రమంలో ఫుట్ బోర్డ్ ప్రయాణీకులకు రాజకొండ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.