బాలికలకు షీటీమ్స్ భరోసా : బాల్య వివాహాలకు  చెక్‌ 

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 05:10 AM IST
బాలికలకు షీటీమ్స్ భరోసా : బాల్య వివాహాలకు  చెక్‌ 

హైదరాబాద్ : నగర పరిధిలో షీటీమ్స్ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. బాలికలు, మహిళలు..బాధితుల కోసం షీటీమ్స్ పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాలను షీటీమ్స్ చెక్ పెడుతున్నాయి. గ్రామ ప్రజలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహక కల్పిస్తున్నారు. దీంతో బాల్య వివాహాల విషయంలో షీటీమ్స్ కు స్థానికుల నుంచి సమాచారం అందుతోంది. వెంటనే ఘటనాస్థలానికి వెళ్తున్న షీటీమ్స్ బాల్యవివాహాలను ఆపివేస్తు..తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో షీటీమ్స్ బాలికలకు అండగా నిలబడుతోంది. 
 

54 బాల్య వివాహాలను అడ్డుకున్న షీటీమ్స్ 
2018లో  షీ టీమ్స్‌కు వచ్చిన సమాచారంతో దాదాపు 54 బాల్య వివాహాలను అడ్డుకుని మైనర్లకు బలవంతపు వివాహాల నుంచి విముక్తి కల్పించి వారికి చదువుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. రాచకొండ షీ టీమ్స్‌కు వచ్చిన సమాచారం మేరకు మొత్తం 54 మందిని కాపాడారు. వీరిలో లో 13 నుంచి 17 ఏళ్ల వారున్నారు. బాలికలకు ఇష్టం లేకుండానే తల్లిదండ్రులు వివాహాలు చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. ప్రేమ వివాహాలకు మొగ్గు చూపుతారనే భయం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వంటి పలు కారణాలే తమ పిల్లలకు బాల్యవివాహాలు జరిపిస్తున్నామని తల్లిదండ్రులు తెలిపారు. తాము ఈ బలవంతపు పెళ్లి నుంచి కాపాడాలంటు షీ టీమ్స్‌కు సమాచారాన్ని తెలిపామనీ..వారి వల్లనే తాము తప్పించుకున్నామని పలువురు బాలికలు తెలిపారు.
 

బాల్య వివాహాలపై షీటీమ్స్ 2 వేల అవగాహన కార్యక్రమాలు..
బాల్య వివాహాలను నియంత్రించేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకూ 2 వేల అవగాహన కార్యక్రమాలను నిర్వహించామనీ..వాటిలో ముఖ్యంగా తెలిసి తెలియని వయసులో పెండ్లి చేస్తే వారి మానసిక పరిస్థితిపై ఒత్తిడి ఎలా ఉంటుంది..ఆరోగ్య సమస్యలు..బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లికి ఎంత ప్రమాదకరంగా మారుతుందనే విషయాలపై అవగాహన కల్పించామని షీటీమ్ అధికారులు తెలిపారు. బాల్యవివాహాలు చేస్తే ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ కింద రెండేండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని ప్రచారం చేశామని..బాల్య వివాహానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ శిక్ష పడుతుందని హెచ్చరించారు.