30 జెడ్పీలు…535 ఎంపీపీలు

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 04:01 AM IST
30 జెడ్పీలు…535 ఎంపీపీలు

హైదరాబాద్ : రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు గడువు ముంచుకొస్తోంది. జులై 4, 5వ తేదీల్లో జెడ్పీలు, ఎంపీపీల ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. రెవెన్యూ జిల్లాలు, మండల ప్రాతిపదికగా జెడ్పీలు,  ఎంపీపీలు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాలు, మండల పరిధి ప్రాతిపదికగా జిల్లా ప్రజాపరిషత్‌లు, మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 25లోగా పునర్ విభజన ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేసి పంపించాలని కలెక్టర్లకు సూచించింది. 

క్షేత్రస్థాయి పరిస్థితులు, సవివరమైన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ల నుండి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 585 గ్రామీణ రెవెన్యూ మండలాల్లో పట్టణ స్వరూపం ఉన్నవాటిని మినహాయించి 535 మండలాలకు ప్రజాపరిషత్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయించి 30 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు…నాలుగు మండలాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వీటిని సైతం తుది జాబితాలో చేరుస్తారని టాక్ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రకారమే 9 జిల్లాల ప్రజాపరిషత్‌లున్నాయి. ఎంపీపీలు కూడా పాత మండలాల సంఖ్య ప్రకారమే ఉన్నాయి. జులై 5వ తేదీతో వీటి కాలపరిమితి పూర్తి కానుంది. ఇటీవలే గ్రామ పంచాయతీలకు అమలు చేసినట్లుగానే రెండుసార్లు ఒకే రిజర్వేషన్ అమలయ్యేలా జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు రిజర్వేషన్ల విధానం ఖరారు చేయనున్నారు.