ట్రాఫిక్ కష్టాలకు చెక్ : ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

  • Published By: madhu ,Published On : October 27, 2019 / 04:00 AM IST
ట్రాఫిక్ కష్టాలకు చెక్ : ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఐటీ కారిడార్‌కు త్వరలోనే ఊరట లభించనుంది. బయో డైవర్సిటీ కూడలి అభివృద్ధికి ఆటంకాలు తొలగిపోయాయి. మూడు సంవత్సరాలుగా వేధిస్తున్న భూ సేకరణ సమస్య ఓ కొలిక్కి వచ్చేసింది. పై వంతెన పనులు ఇక చక చక పూర్తి కానున్నాయి. రెండు స్థాయిల్లో దాదాపు రూ. 65 కోట్లతో ఈ కూడలిపై ఉద్దేశించిన పై వంతెనల్లో ప్రస్తుతానికి ఖాజాగూడ – మైండ్ స్పేస్ కూడలి మార్గం పూర్తయ్యింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆలస్యమౌతున్నాయి. ఈ సమస్య తీరితే..తుది మెరుగులు దిద్ది రాకపోకలు ప్రారంభిస్తామని GHMC వెల్లడించింది. ఇరువైపులా ఉన్న ప్రైవేటు స్థలాల సమీకరణ పూర్తయినందున త్వరలో గచ్చిబౌలి – ఖాజాగూడ కూడలి పై వంతెన సైతం పట్టాలెక్కనుంది. మార్చి కల్లా దీని పనులు ముగుస్తాయని ఇంజినీర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

జీహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం రూ. 22 వేల కోట్ల అంచనా వ్యయంతో SRDP శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మెహిదీపట్నం – బయో డైవర్సిటీ పార్కు, మైండ్ స్పేస్ – అయ్యప్ప సొసైటీ – కేపీహెచ్‌బీ మార్గాలు ప్రధానమైనవి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. రోడ్లను పూర్తిగా విస్తరించి..పై వంతెనలు, అండర్ పాస్‌లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో అయ్యప్ప సొసైటీ అండర్ పాస్, మైండ్ స్పేస్ కూడలి అండర్ పాస్‌లు పూర్తయ్యాయి. వీటికి అనుబంధంగా ఉన్న బయో డైవర్సిటీ పనులకు ఆదిలోనే చిక్కులు ఎదురయ్యాయి.

భూ సేకరణ సమస్య ప్రధానంగా ఉంది. భూ సేకరణ చట్టాన్ని ఉపయోగించి నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో ఓ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. బయో డైవర్సిటీ పార్కుకు ఆనుకుని ఉన్న స్థలానికి రూ. 8.34 కోట్లు, దానికి ఎదురుగా గచ్చిబౌలి రోడ్డుపై ఉన్న స్థలానికి రూ. 10 కోట్ల చెక్కులను సిద్ధం చేసినట్లు ప్రణాళిక విభాగం వెల్లడించింది. పిస్తాహౌజ్ నుంచి మొదలై రాయదుర్గం పీఎస్ సమీఫంలోని షాగౌన్ రెస్టారెంట్ వద్ద పై వంతెన, ఓరియన్ వద్ద నుంచి మై హోమ్ వద్ద రెండో వంతెనలు ముగుస్తాయి. ఇది ఎల్ ఆకారంలో ఉండనుంది. 
Read More : ఆర్టీసీ సమ్మె 23వ రోజు : తేలని పంచాయతీ..బస్సు రోడ్డెక్కేనా