హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : జలమండలి ఏర్పాట్లు

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 06:39 AM IST
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : జలమండలి ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో వీధి వీధినా కొలువైన గణనాథులు..అత్యంత వైభవంగా పూజలందుకుని తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్  12న నగరంలో కొలువైన గణేషుల నిమజ్జనోత్సవం అంత్యం కోలాహలంగా జరుగనుంది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

వీరి కోసం హైదరాబాద్ జలమండలి ఏర్పాట్లను మమ్మురం చేసింది. ఈ వేడుకలు చూసేందుకు వచ్చే భక్తుల కోసం మంచినీటి సమస్య లేకుండా నగరవ్యాప్తంగా మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ తెలిపారు. 

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. నగరంలో గణేష్ నిమజ్జన యాత్రను చూసేందుకు వచ్చిన భక్తుల కోసం జలమండలి మంచినీటి వసతి ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.నగరంలోని 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలు ఏర్పాటుచేసి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
 

మంచినీటి శిబిరాల్లో 30 లక్షల 52వేల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అలాగే అయా మంచినీటి శిబిరాల్లో భక్తులకు మంచినీటిని అందించేందుకు 24 గంటలు షిప్టుల వారీగా సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎండీ తెలిపారు.

వీటితో పాటు గణేష్ శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో మంచినీటి పైపులైనులో ఏవైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు  చేపట్టాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రాత్రి సమయాల్లో ఎయిర్ టెక్ యంత్రాలతో ప్రధాన రహదారులతో పాటు గల్లీల్లో కూడా సెవరెజీ పైపులైను క్టీన్ చేసి..మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా చూడాలని ఆదేశించారు. మ్యాన్ హోళ్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ ఆదేశించారు. మంచినీటి వసతి గణేష్ నిమజ్జనం రోజు తెల్లవారుజామున 3గంటలకే ప్రారంభమవుతుందని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.