సామాన్యుడికి ఉల్లి పోటు: ధరలు పైపైకి.. భారీగా పెరిగిన ధరలు

  • Published By: vamsi ,Published On : September 19, 2019 / 04:08 PM IST
సామాన్యుడికి ఉల్లి పోటు: ధరలు పైపైకి.. భారీగా పెరిగిన ధరలు

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిగడ్డ ధరలు మరోసారి సామన్యుడిని గడగడలాడిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉల్లి గడ్డల ధరలు ఒక్కసారిగా గురువారం(19 సెప్టెంబర్ 2019) మార్కెట్లో క్వింటాల్ రూ.4500కు చేరుకుంది. హైదరాబాద్‌ నగరానికి ఉల్లిపాయల దిగుబడి తగ్గడమే ఇందుకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉల్లిగడ్డ సరఫరా అవుతుంది. ఈ క్రమంలోనే ఉల్లి రేట్లు భారీగా పెరిగిపోయాయి.

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉల్లిపాయలు పాడైపోగా.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగడంతో ఉల్లి దిగుమతులు తగ్గగా.. రేట్లకు రెక్కలు వచ్చేశాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌కు రోజుకు 75 నుంచి 150లారీల ఉల్లిగడ్డ దిగుమతి జరుగుతుండగా ప్రస్తుతం నగరానికి 30 నుంచి 40లారీల మేరకే వస్తున్నాయి. దీంతో ధరలు పెరిగిపోయాయి.

నాలుగు రోజుల క్రితం వరకూ క్వింటాల్‌ ఉల్లిధర రూ. 3200 నుంచి రూ. 3600 వరకు పలకగా ఇప్పుడు రూ.4500కు పెరిగిపోయింది. నగరంలో రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లిగడ్డ ధర కిలో రూ. 50 నుంచి రూ. 60 అమ్ముతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ. 10 పలికిన ఉల్లిగడ్డ ఇప్పుడు కొనాలంటే సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఇదిలా ఉంటే ఉల్లి ధరలు పెరగగా కొందరు వ్యాపారులు ఇప్పటికే పెద్దమొత్తంలో నిల్వచేసి ఉంచుతున్నారు.