తెలంగాణాలో విచిత్ర పరిస్థితి : పగలు ఎండ – సాయంత్రం వాన

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 12:58 AM IST
తెలంగాణాలో విచిత్ర పరిస్థితి : పగలు ఎండ – సాయంత్రం వాన

తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పగలు భానుడు భగభగమని మంటపుట్టిస్తుంటే..సాయంత్రం వాతావరణం చల్లబడి వానలు పడుతున్నాయి. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు పడుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. 

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్‌పర్తిలో పిడుగుపాటుతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివిధ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, వరంగల్, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు పడ్డాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానకు పలు జిల్లాల్లో ధాన్యం, మామిడి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిప్పులు కురిపించిన భానుడు… సాయంత్రానికి చల్లబడ్డాడు. నగరంలో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. సికింద్రాబాద్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, తార్నాక, ఉప్పల్‌, నాచారం, సనత్‌నగర్‌, మెహదీపట్నం, లక్డీకాపూల్‌, చిక్కడపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, బాలా నగర్‌, సంతోష్‌నగర్‌లో ఓ మోస్తరు వర్షం కురింది. వర్షం నీటితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.