Hyderabad : హైదరాబాద్‌లో ‘యూ టర్న్’తిప్పలు .. ట్రాఫిక్ పోలీసుల ట్రయల్ రన్‌తో వాహనదారుల కష్టాలు
హైదరాబాద్‌లో వాహనలదారులకు కొత్తగా మరో కష్టం వచ్చి పడింది. అదే ‘యూ టర్న్’తిప్పలు. ట్రాఫిక్ పోలీసుల ట్రయల్ రన్ తో వాహనదారుల కష్టాలు తప్పటంలేదు.

Hyderabad : కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిన చందంగా మారింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తోన్న ట్రాఫిక్ డైవర్షన్ వల్ల రద్దీ తగ్గకపోగా రెట్టింపు అయింది. పైపెచ్చు స్టేట్‌గా వెళ్తే ఒక్క నిమిషంలో వచ్చే గమ్యస్థానానికి ట్రాఫిక్ మళ్లింపు వల్ల చుట్టూ తిరిగి 20 వెళ్లడం వల్ల 15 నిమిషాలు పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సరైన సమయానికి గమ్యస్థానం చేరలేకపోతున్నామని..ముఖ్యంగా ఆఫీసులకు ఆలస్యం కావటంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు వాహనదారులు.
హైదరాబాద్లో బండి బయటకు తీయాలంటేనే హడల్. ఇక జూబ్లీహిల్స్ వైపు వెళ్లాలంటే భూమాతకు ఉన్నంత ఓపిక తెచ్చుకోవాలి. ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అట్లుంటది మరి. జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జి వెళ్లే రూట్‌లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ చుట్టూ 8 ప్రాంతాలను హెవీ ట్రాఫిక్ ఏరియాలుగా గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమం చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులతో వాహనాల రద్దీ సమస్య తీరడం ఏమో కానీ తమను జూబ్లీహిల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల లెక్క ప్రకారం ట్రాఫిక్ డైవర్షన్‌తో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిలింనగర్, రోడ్‌నెంబర్ 45లో రద్దీ భారీగా తగ్గిపోయి వాహనదారులు ట్రాఫిక్ జంజాటం లేకుండా సాగిపోవాలి. కానీ వాస్తవంగా ఇందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. ట్రాఫిక్ మళ్లింపులతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఫిలింనగర్, రోడ్‌నెంబర్ 45లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. బంపర్ టు బంపర్ సాగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. ట్రాఫిక్ కష్టాలను తీరుస్తామంటూ జూబ్లీహిల్స్‌లో తిప్పుతున్నారని మండిపడ్డారు.
ట్రాఫిక్ మళ్లింపులు చేసిన పోలీసులు డైవర్షన్ చేసిన చోట మాత్రమే ఓ ఫ్లెక్సీ పెట్టేశారు. ట్రాఫిక్ పోలీసులతో అనౌన్స్ చేశారు. కానీ కొంచెం ముందుకు వెళ్లాక ఎటువైపు వెళ్తే తమ గమ్యస్థానం వస్తుందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్ చుట్టూ చక్కర్లు కొట్టి ఎక్కడ నుంచి డైవర్షన్ తీసుకున్నారో మళ్లీ అక్కడికే వచ్చి చేరారు. కొందరైతే ట్రాఫిక్ పోలీసుల దగ్గరికి వెళ్లి పెన్నుపేపర్‌తో రూట్ మ్యాప్ గీయించుకుని మరీ వెళ్లారు.
ఫిలింనగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 జంక్షన్‌లో సిగ్నల్స్ నిలిపివేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45కి .. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్‌కు .. ఫిలింనగర్ నుంచి చెక్‌పోస్ట్‌కు నేరుగా వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. చెక్ పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జికి వెళ్లాలంటే ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. ఫిలింనగర్ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. ఫిలింనగర్ నుంచి చెక్ పోస్ట్ కు వచ్చేవారు కేబుల్ బ్రిడ్జి ఫ్లై ఓవర్ కింద యూటర్న్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వెళ్లేవారు ఫిలింనగర్ జంక్షన్ నుంచి కుడివైపున వెళ్లాలి చెక్‌పోస్ట్ నుంచి జర్నలిస్ట్ కాలనీకి వెళ్లేవారు ఫిలింనగర్ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. బంజారాహిల్స్ నుంచి చెక్‌పోస్ట్ వచ్చేవారు ఫిలింనగర్ జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని భవన్స్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. నేరుగా వెళ్తే ఒక్క నిమిషంలో చేరుకునే గమ్యస్థానానికి యూటర్న్ వల్ల చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల 15 నిమిషాలు వృథా అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వాహనదారుల ఇబ్బందులపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. రూట్ తెలియకే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని రెండు మూడు రోజులైతే అంతా సర్దుకుంటుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.