టార్గెట్ 17: క్లీన్ స్వీప్ చేయాలని బాస్ ఆదేశం

టార్గెట్ 17: క్లీన్ స్వీప్ చేయాలని బాస్ ఆదేశం

అసెంబ్లీ ఎన్నికలు.. పంచాయతీ పోరులో ఘన విజయం సాధించిన జోష్‌తో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 2019 మార్చి 17వ తేదీని సెంటిమెంట్‌‌గా భావిస్తున్న కేసీఆర్.. కరీంనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. 

16 లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమంటున్న టీఆర్ఎస్ అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న దానికి తగ్గట్టుగానే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ భేటీలో బహిరంగ సభలకు సంబంధించి నేతలకు కేసీఆర్ సూచనలిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో జన సమీకరణ భారీగా ఉండాలని.. 2లక్షలకు మించి జనం తగ్గొద్దంటూ నేతలకు వివరించారు. 

ప్రతీ లోక్‌సభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలని, అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను భుజాన వేసుకోవాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి లోక్‌సభ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం(2019 మార్చి 12) జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేలకు సూచనలు చేసిన కేసీఆర్ మాక్‌ పోలింగ్ నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంకోసారి మాక్ పోలింగ్ నిర్వహించి ఆ తర్వాత ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్‌లో అసెంబ్లీకి తీసుకెళ్తారు.