సౌదీలో సంపుతుండ్రు KTR అన్న.. కాపాడండి

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 05:20 AM IST
సౌదీలో సంపుతుండ్రు KTR అన్న.. కాపాడండి

‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు వీడియో ద్వారా వేడుకున్నాడు.

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎం.డి. సమీర్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. సౌదీలో పడుతున్న కష్టాన్ని వెలవరించాడు. ఈ రంజాన్ మాసం నాకు చివరి రోజులు అయ్యేటట్లు ఉన్నాయి, సౌదీ ఏజెంట్ మోసం చేశాడు.. నరకయాతన అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘మంచి జీతం ఇప్పిస్తా అని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్ చెప్పిండు. ఇక్కడకు వస్తే గొర్లు మేపిస్తున్నరు.. ఎవరూ ఉండరు.. ఒక్కడినే ఉంటున్న అంటూ కష్టాలను కన్నీటితో చెప్పుకున్నాడు.

చాటుగా వచ్చి మేసెజ్ పెడుతున్న.. 1,200 కిలో మీటర్ దూరంలో ఎడారిలో నన్ను గొర్రెల కాపరిగా మార్చిండ్రు.. 20 రోజులు అన్నం ముద్ద కూడా తినలేదు.. పని చేయకపోతే కొడుతున్నరు.. తంతుండ్రు.. గోస గోస పెడుతున్నరు అన్న అంటూ కేటీఆర్ కు విన్నవించుకున్నాడు. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను కాపాడు’ అంటూ ఏడుస్తూ ఆ యువకుడు చెప్పాడు. ఈ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే స్పందించారు. అక్కడి ఇండియన్ ఎంబసీకి వీడియోను పోస్టు చేశారు. తగిన సహాయం చేసి ఇండియాకు రప్పించాల్సిందిగా కోరారు.