Telangana High Court : రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ దంపతులు, సిగ్గుచేటు అన్న హైకోర్టు

హైదరాబాద్ కి చెందిన గంగాధర్‌ తిలక్‌, వెంకటేశ్వరి దంపతులు. ఈ వృద్ధ దంపతులు నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Telangana High Court : రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ దంపతులు, సిగ్గుచేటు అన్న హైకోర్టు

Telangana High Court

Telangana High Court : హైదరాబాద్ కి చెందిన గంగాధర్‌ తిలక్‌, వెంకటేశ్వరి దంపతులు. ఈ వృద్ధ దంపతులు నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై సీరియస్ అయ్యింది.

పెన్షన్ డబ్బుతో వృద్ధ దంపతులు గుంతలు పూడుస్తున్నారని మీడియాలో వచ్చిన కథనంపై హైకోర్టు విచారణ చేపట్టింది. పెన్షన్ డబ్బుతో వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్‌ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు అంది. జీహెచ్‌ఎంసీ అధికారుల వేతనాలను తిలక్‌ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది.

ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? పని చేయనప్పుడు జీహెచ్‌ఎంసీకి బడ్జెట్‌ తగ్గించడం మంచిదని ధర్మాసనం కామెంట్ చేసింది.

విచారణ సందర్భంగా నగరంలో అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. రోడ్లపై గుంతలే లేవా? న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా? అని హైకోర్టు నిలదీసింది. వర్షా కాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మతుల కోసం ప్రణాళికలేంటని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు… జోన్ల వారీగా జోనల్‌ కమిషనర్లు, ఎస్‌ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది.

రోడ్లపై గుంతలు పడటం, వాటిపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడటం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ వాటిని పట్టించుకోరు. ప్రజలు కూడా గుంతల రోడ్లను చూసీ చూడనట్లు వదిలేసి.. అవే రోడ్లపై అవస్థలు పడుతూ ప్రయాణిస్తుంటారు. కానీ ఈ 70ఏళ్ల వృద్ధ జంట అందరిలా అనుకోలేదు. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రమాదాలను చూసి చలించిపోయిన ఆ దంపతులు.. గుంతలను పూడ్చుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆయన పేరు గంగాధర్ తిలక్ కట్నం. వయసు 73ఏళ్లు. ఆయన భార్య పేరు వెంకటేశ్వరి కట్నం. వయసు 64ఏళ్లు. రోడ్లపై గుంతల కారణంగా ఎన్నో ప్రమాదాలు జరగుతున్నాయని, ఈ సమస్యకు పరిష్కారం దిశగా తాను ఈ పని చేస్తున్నట్టు తిలక్ చెప్పారు. 2010 నుంచి గంగాధర్‌ తిలక్‌, వెంకటేశ్వరీ దంపతులు ఓ కారులో రోడ్‌ బ్రాండ్‌ మెటీరియల్‌ తీసుకొని వెళ్లి గుంతలను పూడుస్తున్నారు. తమ కారుకు పాత్‌హోల్‌ అంబులెన్స్‌ అని పేరు కూడా పెట్టారు. గుంత కనిపిస్తే కారు ఆపి దానిని పూడ్చేస్తారు. ఇప్పటి వరకూ దాదాపు 2030 గుంతలను తిలక్‌ దంపతులు పూడ్చారు. ఒక్కో గుంత పూడ్చడానికి రూ.2వేల వరకూ ఖర్చు అవుతోంది. పెన్షన్ డబ్బునే ఉపయోగించి తిలక్‌ దంపతులు స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారు. తిలక్‌ చేస్తున్న సామాజిక సేవకు మెచ్చి బిగ్‌బి అమితాబ్‌ ఓ కారును వారికి బహుమతిగా ఇచ్చారు.